logo

గమాంగ్‌ దంపతుల మద్దతు ఎవరికో?

రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌, ఆయన భార్య హేమా గమాంగ్‌ పేరు తెలియని వారుండరు. గిరిధర్‌ గమాంగ్‌కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది.

Updated : 23 Apr 2024 06:51 IST

గుణుపురం, న్యూస్‌టుడే : రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌, ఆయన భార్య హేమా గమాంగ్‌ పేరు తెలియని వారుండరు. గిరిధర్‌ గమాంగ్‌కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన భార్య హేమాగమాంగ్‌ కూడా రాజకీయాలకు రాకముందు భర్తకు అన్ని రంగాల్లో సలహాలు, సహకారం అందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గమాంగ్‌ దంపతులు పోటీలో లేరు. గుణుపురం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా గిరిధర్‌ బంధువులే కావడంతో మాజీ ముఖ్యమంత్రి దంపతుల మద్దతు ఎవరికి ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.

పోటీకి దూరం

గిరిధర్‌ గమాంగ్‌ కాంగ్రెసులో సీనియర్‌ నాయకుడు. తొమ్మిదిసార్లు ఎంపీగా, పదేళ్లు కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా సేవలందించారు. ఆయన రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగేవారు. తర్వాత కాంగ్రెస్‌ను వదిలి భాజపాలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక తిరిగి కాంగ్రెసు గూటికి వెళ్లారు. ఆయన భార్య హేమా గమాంగ్‌ గృహిణిగా ఉండి కొరాపుట్ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత గుణుపురం ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజదలో చేరారు. గత ఎన్నికల్లో లక్ష్మీపురం నియోజకవర్గం నుంచి బిజద అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తరువాత ఆమె భర్త బాటలోనే కాంగ్రెసు గూటికి చేరారు. ఈ ఎన్నికలలో  అఖిల భారత కాంగ్రెసు నాయకుల ఆశీర్వాదం ఉండడంతో హేమా గమాంగ్‌కు కాంగ్రెసు టికెట్‌ వస్తుందని ఆశ పడ్డారు. ఆ ఆశ నెరవేరలేదు. ప్రస్తుతానికి వీరి కుటుంబంలో ఎవరికీ టిక్కెట్‌ లేకపోవడంతో పోటీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో వీరు ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతారోనన్న చర్చ సాగుతోంది. పోటీలో ఉన్న కాంగ్రెసు, బిజద, భాజపా అభ్యర్థుల ముగ్గురూ వీరికి బంధువులు కావడమే ఇందుకు కారణం. కాంగ్రెసు అభ్యర్థి సత్యజిత్‌ గమాంగ్‌ గిరిధర్‌ తమ్ముని కొడుకు. భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న త్రినాథ్‌ గమాంగ్‌ గిరిధర్‌కు బావమరిది అవుతారు. బిజద ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్‌ గమాంగ్‌ హేమాగమాంగ్‌కు మేనమామ వరస అవుతారు. దీంతో వీరి మద్దతుపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని