logo

బొలంగీర్‌ కోట రాణి సంగీతా సొంతమయ్యేనా?

పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్‌ కోట (లోక్‌సభ స్థానం)ను మళ్లీ రాణి సంగీతా కుమార్‌ సింగ్‌దేవ్‌ సొంతం చేసుకోగలరా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.

Published : 28 Apr 2024 06:52 IST

ఈసారి సవాల్‌ విసురుతున్న సరేంద్ర, మనోజ్‌ 

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్‌ కోట (లోక్‌సభ స్థానం)ను మళ్లీ రాణి సంగీతా కుమార్‌ సింగ్‌దేవ్‌ సొంతం చేసుకోగలరా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇద్దరు ఉద్ధండులు ఆమెకు సవాల్‌ విసురుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో ఎవరిది ‘పైచేయి’ అన్నదానిపై పరిశీలకులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

రాజపరివారానికి విశేషాదరణ

బొలంగీర్‌ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ సంగీతా మళ్లీ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీ మంత్రి సురేంద్ర సింగ్‌ భోయ్‌ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజద గూటికొచ్చారు. ఆ పార్టీ తరఫున బొలంగీర్‌ అభ్యర్థి అయ్యారు. ప్రముఖ సినీనటుడు మనోజ్‌ మిశ్ర కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బొలంగీర్‌ స్థానంలో రాజపరివారానికి చెందినవారిని ఓటర్లు చాలాసార్లు గెలిపించారు.

ఆయన  మిస్టర్‌ ఇండియా

బిజద అభ్యర్థి సురేంద్ర విషయానికొస్తే దేహదారుఢ్య పోటీల్లో ‘మిస్టర్‌ ఇండియా’ అవార్డు సాధించిన వ్యక్తి. ఎన్నో పోటీల్లో పాల్గొని రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపజేశారు. కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి మంత్రిగాను విధులు నిర్వహించారు. గతసారి పరాజయం పాలయ్యారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజదలో చేరిన సురేంద్రకు సీఎం నవీన్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి నిలిపారు. తనను గెలిపిస్తే పరిశ్రమలు లేని బొలంగీర్‌లో ఉపాధి కల్పనకు బాటలు వేసి వలసలకు అడ్డుకట్ట వేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సీఎం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్నారు. లోయర్‌ సుక్తేల్‌ నీటిపారుదల ప్రాజెక్టు స్థాయి పెంచి వ్యవసాయక్షేత్రాలను సస్యశ్యామలం చేసి అన్నదాలకు అండగా ఉంటానని హామిలిస్తున్నారు.

సంగీతాకుమారీ సింగ్‌దేవ్‌ ప్రచారం

విస్తృత ప్రచారం

సంగీతా 2004, 2009, 2019లలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఆమె మరిది కాళికేష నారాయణ్‌ సింగ్‌దేవ్‌ గెలిచారు. బొలంగీర్‌ రాజు దివంగత రాజేంద్ర నారాయణ సింగ్‌దేవ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే. నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికవుతానన్న దృఢవిశ్వాసం వ్యక్తం చేస్తున్న సంగీతా సింగ్‌దేవ్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

రియల్‌ హీరోగా పనులు చేస్తా

వెండి తెరపై హీరోగా, క్యారెక్టర్‌ నటునిగా మెప్పించిన తాను ఒక రియల్‌ హీరోగా ప్రజలకు సేవలు చేస్తానంటున్నారు బొలంగీర్‌ వాసినైన తనకు ఈ ప్రాంత సమస్యలు తెలుసని, రాజకీయ రంగ ప్రవేశం చేసి వాటిని నెరవేర్చాలన్న ఆశయంతో వచ్చానని, ఆదరించాలని ఓటర్లను కోరుతున్నారు.

పోరు రసవత్తరం

బొలంగీర్‌లో ఈ ముగ్గురు యోధుల పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో ఉంది. విజయాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న వీరు అన్నివర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వలసలకు చిరునామాగా నిలుస్తున్న ఈ ప్రాంతంలో ఓటర్లు ఈసారి ఎవర్ని ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని