logo

అందలంపై నీవు.. అంధకారంలో మేము

గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు..

Published : 28 Apr 2024 04:50 IST

గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. వీధిదీపాల వ్యవస్థను అస్తవ్యస్తం చేసేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రత్యేక ఏజెన్సీని సాగనంపేశారు.. మరోవైపు పురపాలికలకూ నిధులివ్వక దిక్కుతోచని పరిస్థితిని దరిచేర్చారు.. ఇదీ జగనన్న చీకటి రాజ్యం..

న్యూస్‌టుడే, రాజాం, బొబ్బిలి,  విజయనగరం పట్టణం, నెల్లిమర్ల 

ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో రాత్రయితే చీకట్లు రాజ్యమేలుతున్నాయి. వీధి దీపాల నిర్వహణ భారంగా మారడంతో పురపాలికలు పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. నిధులు కొరతా వెంటాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఈఈఎస్‌ఎల్‌ సంస్థ దీపాల బాధ్యతను చూసుకునేది. ఏడేళ్ల పాటు పనులు చేసేందుకు ముందుకొచ్చింది. ఈమేరకు 2016లోనే పురపాలికలతో ఒప్పందం చేసుకుంది. ఒక్క విజయనగరం నగరపాలక సంస్థ అప్పట్లో నెలకు రూ.16 లక్షలు చెల్లించేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నిర్వహణ కొనసాగించింది. అయితే జగన్‌ సర్కారు హయాంలో సకాలంలో నిధులు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో గడువు ముగిశాక తప్పుకొంది.

రాజాం పరిధిలోని విజయనగరం రోడ్డులో స్తంభాలకు వీధిదీపాలు లేని దృశ్యం

జిల్లాలో ఇలా..

  • రాజాం పట్టణ పరిధిలోని ప్రధాన, పాలకొండ, బొబ్బిలి, శ్రీకాకుళం రహదారుల్లో కొన్ని దీపాలు వెలగడం లేదు. విజయనగరం రహదారిలోని గాయత్రీ కాలనీ వరకూ అంధకారం నెలకొంటోంది. రహదారి విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం, దీనికి అంధకారం తోడవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రాంతాలు, శివారు కాలనీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 
  • నెల్లిమర్ల, జరజాపుపేటలోని ప్రధాన రోడ్లలోనే దీపాల్లేవు. కీలకమైన రామతీర్థం కూడలి, గాంధీనగర్‌లోనూ ఇదే దుస్థితి. 
  • బొబ్బిలిలో ప్రధానమైన ఇందిరమ్మకాలనీలో ఏళ్లనుంచి సమస్య ఉంది. ఇక్కడ కొత్తతీగల కోసం రూ.20 లక్షల నిధులు కేటాయించారు. ఇంతవరకు పనుల్లేవు. ఇక్కడ 3 వేల గృహాలుండగా.. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు.

నగరపాలికలో ఘోరం..

జిల్లా కేంద్రంలోని 27 డివిజన్లలోని వీధుల్లో సమస్య తీవ్రంగా ఉంది. గతంలో రహదారులను విస్తరించి, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం ప్రతిపాదించినా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. నిత్యం జిల్లా అధికారులు తిరిగే కలెక్టరేట్‌ ఇన్‌గేటు నుంచి ఎన్టీఆర్‌ విగ్రహ కూడలి వరకు నిత్యం అంధకారం నెలకొంటోంది. శివారు, విస్తరించిన ప్రాంతాల్లో కొత్తగా 500 వరకు దీపాలు వేయాలి. మూడో విద్యుత్తు లైన్‌ కోసం రూ.94 లక్షలను నగరపాలక అధికారులు ఈపీడీసీఎల్‌కు చెల్లించారు. అయినా పనులు సక్రమంగా జరగలేదు. నగరపాలిక పరిధిలో నిర్వహణ పనుల కోసం ఓ ప్రైవేటు సంస్థ ఏడాదికి రూ.1.53 కోట్లతో టెండర్లు దక్కించుకుంది. కానీ అంధకారం కనిపిస్తోంది.

బొబ్బిలిలోని బాలాజీ నగర్‌లో పరిస్థితి ఇదీ..

సకాలంలో పనులు చేయడం లేదు..

అంబటిసత్రం ప్రధాన దారిలో 15 రోజుల నుంచి వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళల్లో చీకటిగా ఉంటోంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పనులు చేయడం లేదు.

షఫీ, మెకానిక్‌, విజయనగరం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని