logo

134 ఎకరాలు హాంఫట్‌

రూ. కోట్ల విలువైన దేవుడి మాన్యాలు ఆక్రమణ చెరలో చిక్కాయి. దక్షిణ సింహాచలంగా గణతికెక్కిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని విక్రయిస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది

Published : 19 Jul 2023 03:10 IST

 కబ్జా చెరలో దేవుడి మాన్యాలు  
చక్రం తిప్పుతున్న వైకాపా నేతలు
 కలెక్టర్‌ ఆదేశాలు అమలయ్యేనా ?

నరసింహస్వామి ఆలయ చిత్రం

రూ. కోట్ల విలువైన దేవుడి మాన్యాలు ఆక్రమణ చెరలో చిక్కాయి. దక్షిణ సింహాచలంగా గణతికెక్కిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని విక్రయిస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ అంశం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించి ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించాలని ఆదేశాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధూప దీప నైవేద్యాల నిమిత్తం  నెల్లూరు, గూడూరు, ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లోని 693.47 ఎకరాల భూములు దాతలు అందజేయగా, అందులో రెండొందల ఎకరాల వరకూ అన్యాక్రాంతమయ్యాయి. ఒక్క పాత సింగరాయకొండ పరిధిలోనే 134 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలో ఉన్న భూముల్ని  స్వాధీన పరచుకోవాలని అయిదేళ్ల క్రితం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా, నేటికీ చర్యలు లేవు. ఆరు నెలల క్రితం ఆలయ పాలకవర్గం ఏర్పడినప్పుడు ఆస్తులను పరిరక్షిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా నేటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు.

బోర్డులు ఏర్పాటుచేసినా..

ఇటీవల ఆలయానికి కూతవేటు దూరంలోని 607 సర్వే నంబరులోని 2.98 ఎకరాలు చదును చేసి కబ్జాకు తెరదీయగా, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆలయానికి చెందిన భూమి అంటూ బోర్డు ఏర్పాటుచేసినా, స్థానిక వైకాపా నాయకుడు బరితెగించి రూ.3 కోట్లకు ఇక్కడి భూముల్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని సమాచారం. అధికార పార్టీ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి ఆక్రమణదారులపై అధికారులు చర్యలు చేపట్టడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతసింగరాయకొండ పంట చెరువుకు వెళ్లే ప్రధాన కాల్వను సైతం ఆక్రమించి కొందరు అమ్మకాలు సాగించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. స్వామివారికి వందల ఎకరాల భూములున్నా ఆలయంలో నిత్యం అన్నదానాలకు, ధూప దీప నైవేద్యాలకు దాతల సహకారం కోసం ఎదురు చూడాల్సిన దీనస్థితి దాపురించింది.

జామాయిల్‌ తోటలు సాగుచేసి..

పాతసింగరాయకొండ మల్లికార్జున నగర్‌ ఎస్టీ కాలనీకి తూర్పు వైపున జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నెం.105/1లో 1.61, 106/1,2,3,4,5ల్లో 9.47 ఎకరాలు ఆలయం పేరిట నమోదై  ఉన్నాయి. ఈ భూములను కొంతమంది అనధికారిక కౌలు పేరుతో స్వాధీనం చేసుకుని నాలుగు దశాబ్దాలుగా జామాయిల్‌ తోటలు సాగు చేసుకుంటున్నారు. వాటి ద్వారా రూ.లక్షల ఆదాయాన్ని అక్రమంగా ఆర్జిస్తున్నారు. గ్రామ పరిధిలోని అయ్యప్ప నగర్‌ ప్రాంతంలో సర్వే నెం.116లో 5.92, 117లో 7.30 ఎకరాలు స్వామివారి పేరిట ఉండగా, అధికారుల పర్యవేక్షణ కొరవడి ఇది కాస్తా అన్యాక్రాంతమైంది. గతంలో విధులు నిర్వహించిన ఆలయ అధికారులు, పాలక మండలి సహకారంతో పలువురు కబ్జాలకు పాల్పడి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా ఆలయ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

రొయ్యల చెరువులుగా మారినా..

పాత సింగరాయకొండ పరిధిలోని సర్వే నెం.356/2,3లో 5.47, 357లో 5.42, 367లో 8 ఎకరాల భూములను కొందరు రొయ్యల చెరువులుగా సాగు చేసుకుంటున్నారు. వీరిపైనా చర్యలు శూన్యం. ఇక్కడి ఆలయం పేరిట ఉన్న 134 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు దస్త్రాలు మంజూరు చేసి అయిదేళ్లు అయినా నేటికీ అధికారులు భూములు స్వాధీన పరచుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొండపి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆలయ భూముల కబ్జాపై సమీక్షించారు. అన్యాక్రాంతమైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.


చట్టపరమైన చర్యలు చేపడతాం

నరసింహ స్వామి ఆలయం పేరిట ఉన్న భూములు కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు చేపడతాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను, మండలంలోని భూములను సర్వే చేయించి స్వాధీనం చేసుకుంటాం.

ఈవో కృష్ణవేణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని