logo

జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు

రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్‌నే వెంట తెచ్చుకున్నారు.

Published : 29 Apr 2024 03:05 IST

మోహరించిన ప్రైవేట్‌ సైన్యం
‘అతిథి అభ్యర్థి’లా ప్రచారం
బెదిరింపులు.. తెర వెనుక మంత్రాంగం పైనే నమ్మకం

  • ‘ఎన్నికల నిబంధనల అమలులో మరీ ఇంత కఠినంగా ఉంటే మీకే నష్టం మేడమ్‌. మా మీదే ఎడాపెడా కేసులు పెట్టిస్తే ఎలా! మేము ప్రైవేట్‌ కేసులు వేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త’...

  • ‘హలో సర్‌.. ఈ ఎన్నికల్లో మీ సహకారం అవసరం. కాస్త చూసీచూడనట్లు ఉండాలి. కాదూకూడదంటే మీకే ఇబ్బంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏసీబీ మా కంట్రోల్‌లోనే ఉంటుంది. అందువల్ల మేం చెప్పినట్లు వినాలి’..

 ఇటీవల వై.పాలెం మహిళా రిటర్నింగ్‌ అధికారిణి, పోలీసులకు ఓ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి చేసిన హెచ్చరికలు


ముండ్లమూరులో పంపిణీ చేసిన తాయిలాలను తీసుకెళ్తున్న వీవోఏలు (పాత చిత్రం)

ఒంగోలు, న్యూస్‌టుడే: రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్‌నే వెంట తెచ్చుకున్నారు. ఆ వెంటనే జిల్లావ్యాప్తంగా ప్రలోభాల పర్వానికి పెద్ద ఎత్తున తెర లేపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీవోఏలకు డిన్నర్‌ సెట్లు, మిఠాయి పొట్లాలు, నగదు బహుమతులు అందించారు. చూసీచూడనట్లుగా వ్యవహరించిన ఆ పోలీసు బాస్‌ను ఎన్నికల కమిషన్‌ ఈడ్చి కొట్టింది. ఆ తర్వాత రూటు మార్చారు. జిల్లాలో పనిచేసిన పలువురు సీనియర్‌, జూనియర్‌ పోలీసు అధికారులతో పొదిలి కేంద్రంగా తెర వెనుక మంత్రాంగానికి పన్నాగం పన్నారు. అటు అధికారులను, ఇటు పోలీసులను బెదిరిస్తూ తన దారికి తెచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మిగిలిన అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ప్రచారం సాగిస్తుంటే.. ఆయన మాత్రం అడపాదడపా తళుక్కున మెరిసి మాయమైపోతున్నారు. జిల్లాకు అతిథి అభ్యర్థిలా వ్యవహరిస్తున్నారు.

జిల్లాపై చుట్టుపు చూపు...: ప్రచారపర్వంలో ఇతరులకు భిన్నంగా సదరు పార్లమెంట్‌ అభ్యర్థి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా సీరియస్‌గా ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. నామినేషన్‌ కూడా అత్యంత సాదాసీదాగా దాఖలు చేశారు. అంతకుముందు పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి అసెంబ్లీకి తన కుమారుడు పోటీ చేస్తుండటంతో దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంపై చుట్టపుచూపు చూస్తున్నారు.
అన్నీ తెరచాటు ప్రయత్నాలే...: తమ ప్రచారం, కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తారు. ఆయన మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను కలవడం కంటే ప్రలోభాల ద్వారానే ఓట్లు కొల్లగొట్టవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే తన ప్రైవేట్‌ సైన్యంతో ప్రలోభాల పర్వాన్ని సాగించారు. తెరచాటు యత్నాలనూ జోరుగా సాగిస్తున్నారు. సుమారు 70 మంది విశ్రాంత పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసుకుని మద్యం, నగదు అక్రమ రవాణా, అసంతృప్తులను బుజ్జగించడం, విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను కొనుగోలు చేయడంపై ప్రధానం దృష్టి పెట్టారు. ప్రతి సచివాలయానికీ తన ప్రైవేట్‌ సైన్యాన్ని నియమించుకుని ప్రలోభాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సహకరించాలని అధికారులు, పోలీసులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆయన తీరుకు సొంత పార్టీ శ్రేణుల్లో అవాక్కవుతున్నాయి. కార్యకర్తలు, ఓటర్లతో సంబంధం లేకుండా తన సొంత ప్రైవేట్‌ సైన్యంతో నెగ్గుకురావాలనే యోచనను చీత్కరించుకుంటున్నారు.

కుటుంబ సమేతంగా ప్రత్యర్థి...

ఓ ప్రధాన ఆయన రాజకీయ పార్టీ అభ్యర్థి తీరు వివాదాస్పదంగా ఉంటే.. ప్రత్యర్థి, తెదేపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రచారం మాత్రం భిన్నంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. తండ్రికి తోడుగా ఆయన తనయుడు రాఘవ్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా నడుస్తున్నారు. సీనియర్‌ మాగుంట ఒంగోలు, కొండపి, కనిగిరిపై., జూనియర్‌ మాగుంట పశ్చిమంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలపై దృష్టి సారించి పనిచేస్తున్నారు. ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు గీతాలత, చందన విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని