logo

నిన్ను నమ్మాం.. నిండా మునిగాం

కోట్ల రూపాయలు కుమ్మరిస్తాం..ఒంగోలులో తాగునీటి కష్టాలు మటుమాయం చేస్తామంటూ ఓ వైపు ముఖ్యమంత్రి జగన్‌ ప్రగల్భాలు..కనిగిరిలో ఇంటింటికీ కుళాయి అంటూ మంత్రి సురేష్‌ బడాయి కబుర్లతో స్థానికులు నిలువునా మోసపోయారు.

Published : 13 May 2024 03:33 IST

రూ.400 కోట్లన్నావు..ఎక్కడ జగన్‌ !
ఇంటింటికీ కుళాయి ఏమైంది అమాత్యా
దాహం కేకలే మిగిలాయంటూ జిల్లావాసుల ఆగ్రహం

కోట్ల రూపాయలు కుమ్మరిస్తాం..ఒంగోలులో తాగునీటి కష్టాలు మటుమాయం చేస్తామంటూ ఓ వైపు ముఖ్యమంత్రి జగన్‌ ప్రగల్భాలు..కనిగిరిలో ఇంటింటికీ కుళాయి అంటూ మంత్రి సురేష్‌ బడాయి కబుర్లతో స్థానికులు నిలువునా మోసపోయారు. ఈ ద్వయం ఉత్తర కుమారుడిని సైతం మించిపోయిందని జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. ఖజానాలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో ఒంగోలుకు రూ.నాలుగొందల కోట్లు కేటాయిస్తామంటూ ఆర్భాటం చేసిన జగన్‌ ఆ తర్వాత పలాయనం చిత్తగించారు. మున్సిపల్‌ శాఖామంత్రి సురేష్‌దీ అదే తీరు. పరమానందయ్య శిష్యునిలా వీరికి తోడైన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా సాధ్యంకాని వాగ్దానాలతో అభాసు పాలయ్యారు. ఇలా అసమర్థులు పాలకులైన పాపానికి జిల్లావాసులకు అయిదేళ్లుగా దాహం కేకలే మిగిలాయి.

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, పొదిలి, మార్కాపురం, కనిగిరి


ఒంగోలులో.. ముఖ్యమంత్రి బీరాలు

ఒకటో వేసవి చెరువు

పాలకుల నిర్లక్ష్యం నగరానికి శాపంగా మారింది. తాగునీటి వనరులను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమవ్వడంతో నిండు వేసవిలో శివారు కాలనీల వాసులు దాహంతో అల్లాడుతున్నారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం నగరవాసులకు రెండు రోజుల తర్వాత అంటే.. మూడోరోజు నీరు విడుదల చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే ప్రాంతాలకు అయిదు నుంచి ఏడు రోజులకోసారి అందుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రూ.400 కోట్లు నిధులు ఇస్తానని రెండేళ్ల క్రితం ఒంగోలు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. సమగ్ర అంచనాలు వేశాక అది రూ.339 కోట్లకు  ఖరారైంది. ఎన్నికలు వస్తున్నాయని టెండర్లు పిలిచి చేతులు దులుపుకున్నారు. జగన్‌ బీరాలు పలికి తమకు నీటి కష్టాలు మిగిల్చారని వారు వాపోతున్నారు.

దామచర్ల అమృత్‌ నిధులు తెచ్చినా..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్‌ కృషి మేరకు కేంద్ర సహకారంలో అమృత్‌ ప్రాజెక్టు కింద రూ.123 కోట్లు మంజూరయ్యాయి. సాగర్‌ నీరు సక్రమంగా రాని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా గుండ్లకమ్మ నీరు తీసుకొచ్చేందుకు అక్కడి నుంచి పైపులైన్‌ వేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడి చెరువుల్లో 38 శాతం నీరు మాత్రమే ఉండటంతో పంపింగ్‌ మోటార్లకు సక్రమంగా అందడంలేదు. దీంతో శివారు కాలనీలకు వెళ్లే ట్యాంకర్లకు సమస్యగా మారింది. అయిదురోజులకొకసారి ఇవ్వాల్సిన నీటిని వారానికి ఒకసారి సరఫరా చేస్తున్నారు.


పొదిలిలో

ఒక్క రోజు నీరు.. వారం పాటు సర్దుపోటు

పొదిలిలో కుళాయి వద్ద  నీటి కోసం డబ్బాల వరుస

పొదిలి పట్టణంలో గుక్కెడు తాగునీరు దొరకడం గగనమైపోతోంది. వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా జరుగుతుండటంతో వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. దాతల సహకారంతో ఎన్‌ఏపీ సంపు వద్ద ఏర్పాటుచేసిన కుళాయే పట్టణ ప్రజలకు దాహార్తి తీరుస్తోంది. పొదిలి నగర పంచాయతీలో 38,489 వేల మంది జనాభా ఉన్నారు. వీరికి రోజుకు కనీసం 40 లీటర్ల చొప్పున 15.39 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే వారానికి కూడా ఆ నీటిని సరఫరా చేసి సర్దుబాటు చేయలేకపోతున్నారు. దర్శి సమ్మర్‌స్టోరేజి నుంచి వారానికి రెండు రోజులు మాత్రమే పొదిలికి వంతు వస్తుండటంతో పూర్తిస్థాయిలో అందడం లేదు. గడిచిన అయిదేళ్లలో ప్రభుత్వం పొదిలి పెద్దచెరువును సాగర్‌నీటితో నింపేందుకు రూ.50 కోట్లు మంజూరు చేసినా నత్తనడకన పనులు జరుగుతున్నాయి. ఆర్థిక స్థోమతగల వారు డబ్బానీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు.

ఇరవై వార్డుల వారు ఒక్కచోటకి వచ్చి..

ఎన్‌ఏసీ సంపు వద్దకు పొదిలి పట్టణంలోని 20 వార్డులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి నీటిని తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఎన్‌ఏపీ నీటి సంపు సామర్థ్యం పెంచకపోవడంతో దర్శి నుంచి వచ్చిన నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోలేకపోతున్నారు. నీరు వచ్చినప్పుడు పాతూరులో నేరుగా సరఫరా చేయడం, కొత్తూరు ప్రాంతంలో ఓవర్‌హెడ్‌లకు నీటిని ఎక్కించి వీధి కుళాయిలకు సరఫరా చేస్తున్నారు.


మార్కాపురంలో.. నిత్యం కటకటే

నాయుడుపల్లెలో ట్యాంకరు చుట్టూ చేరి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులు

ఏళ్లుగా పశ్చిమ ప్రకాశాన్ని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వేసవి వచ్చిదంటే తీవ్రమైన ఎద్దడి నెలకొంటుంది. గత అయిదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, మన్నెవారిపల్లె, పెద్దయాచవరం, మొద్దులపల్లె, బోడపాడు, రాయవరం, వేములకోట, నికరంపల్లె, తిప్పాయపాలెం, గజ్జలకొండ, పడమటిపల్లె, తూర్పుపల్లె, ఇడుపూరు, పెద్దనాగులవరం తదితర గ్రామాల్లో తాగునీటి కష్టాలు తొలగించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ట్యాంకరు వస్తేనే ఇంట్లో పూట గడిచే పరిస్థితి నెలకొంది. ఏటా మార్కాపురం, పొదిలి పట్టణాల్లో రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మార్కాపురం పట్టణంలో మిగిలిపోయిన వార్డుల్లో పైపులైన్‌, సాగర్‌ నీటి సరఫరా కోసం పనులు జరుగుతున్నాయి. గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఈ సమస్య పరిష్కరించడం కోసం ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో కష్టాలు తప్పడం లేదు.

నత్తనడకన పనులు.. మార్కాపురం పట్టణంలో మున్సిపల్‌ అధికారులు పట్టణంలో ఉన్న 35 వార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద ఉన్న సమర్‌ స్టోరేజీ ట్యాంకు వద్ద నుంచి నీటిని సరఫరా చేసేవారు. పట్టణంలో గతంలో 28 వార్డులకే సాగర్‌ జలాలు సరఫరా అవుతున్నాయి. మిగిలిన ఏడు వార్డుల్లో సాగర్‌ జలాల సరఫరా కావడం లేదు. నీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి నత్తనడకన సాగుతున్నాయి.


కనిగిరిలో.. మంత్రి సురేష్‌ బడాయి

కనిగిరి : ప్రభుత్వం నిధులివ్వక నిలిచిన ఇంటింటికీ కుళాయి పథకం

ఇంటింటికి కుళాయి ద్వారా కనిగిరి పట్టణానికి పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తామని మంత్రి సురేష్‌ మొదలు ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ వరకు అందరూ బడాయి పలుకులే పలికారు. కేవలం వైకాపా నేతలు కమీషన్ల కోసం హడావుడిగా పనులు చేయాలని గుత్తేదార్లను ఒప్పించి..అప్పగించి తమ వాటా తీసుకుని తర్వాత జారుకున్నారు. ప్రభుత్వం పైసా నిధులు విదల్చకపోవడంతో గుత్తేదారులు పనులను నిలిపేశారు.

కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డులుండగా, 13,465 కుటుంబాలు, 55 వేల జనాభా ఉంది. ఒక్కో వ్యక్తికి నిత్యం సగటున 130 లీటర్ల నీరందించాల్సి ఉండగా కనీసం 60 లీటర్లు కూడా అందించలేక పోతున్నారు. కనిగిరి పట్టణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 200 కోట్లతో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దాని స్థానంలో ఇంటింటికి కుళాయి పేరుతో రూ.103.97 కోట్ల నిధులు వెచ్చించి ఇంటింటికీ కుళాయి ద్వారా నీటిని అందిస్తామని చెప్పి నిధులు విదల్చకపోవడంతో పిల్లర్ల స్థాయిలోనే అవి నిలిచిపోయాయి. పట్టణానికి దర్శి నుంచి సాగర్‌ నీళ్లు  అందించే పైప్‌ లైన్‌ లీకేజీ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.    కనిగిరి పట్టణంలో ప్రతిరోజు మున్సిపాలిటీ ద్వారా 90 ట్యాంకర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు డ్రమ్ములే ఇస్తుండటంతో అవి సరిపోవడం లేదు.

కనిగిరిలో నీటి కోసం మహిళల ఆందోళన(పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని