logo

అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద

వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్‌, బైజూస్‌ అంటూ జగన్‌ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ

Updated : 29 Apr 2024 08:08 IST

విప్లవమంటూ మోసపు మాటలు
మధ్యలోనే నిలిచిన నాడు- నేడు పనులు
చెట్ల కిందకు చేరిన పాఠశాల విద్యార్థులు

 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్‌, బైజూస్‌ అంటూ జగన్‌ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ విద్యార్థులను చెట్ల కిందకు నెట్టారు. పిల్లలకు మేనమామగా ఉంటానంటూ అతీగతీ లేని ‘నాడు-నేడు’ పనులతో అన్నం పెట్టే చదువులకు చెదలు పట్టించారు. ఎన్నికల వేళ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అబద్ధాలను పదే పదే పలుకుతూ నిజాలని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 977 విద్యాసంస్థల్లో రెండో దశ ‘నాడు- నేడు’ కింద 1,520 పనులు చేపట్టామని.. రూపురేఖలు మార్చామని ప్రచారంతో మోతెక్కించారు. తీరా చూస్తే అందుకు అవసరమైన నిధులే విడుదల చేయలేదు.

అద్దె ఇళ్లవారూ వద్దన్నారు...

ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలలో 120 మంది పిల్లలున్నారు. గదులు సరిపోకపోవడంతో నాడు- నేడులో నిధులు కేటాయించారు. ఉన్న గదులను కూడా కూల్చి కొత్తగా నిర్మాణం చేపట్టారు. రూ.28 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేసి రూ.15 లక్షలు ఇచ్చాక.. మిగిలినవి నిలిపేశారు. ఇప్పటివరకు అద్దె ఇళ్లలో తరగతులు నిర్వహించారు. ఆ ఇళ్ల వారు ఖాళీ చేయించడంతో గత్యంతరం లేక నిర్మాణం చేసిన స్లాబ్‌ కిందనే తరగతులు నడిపారు. ఆ పక్కనే తవ్వి వదిలేసిన మరుగుదొడ్డి గుంత పక్కనే నిన్నటి వరకు పిల్లలు చదువులు సాగించారు.

సగం నిధులతో సరిపుచ్చారు..

ఒంగోలు నగరంలోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, ఇతర ఆధునికీకరణ పనుల కోసం రూ.32 లక్షలు కేటాయించారు. ఇప్పటికి రూ.18 లక్షలే విడుదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక పనులు నిలిపివేశారు.

పునాదుల్లోనే వదిలేశారు...

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం ఉన్నత పాఠశాలకు రెండో దశ నాడు- నేడు కింద మూడు అదనపు తరగతి గదులు, ప్రహరీ, రెండు మరుగుదొడ్లు, ఆర్వోప్లాంట్‌, విద్యుత్తు, తాగునీటి అవసరాలకు రూ.కోటి అయిదు లక్షల నిధులు కేటాయించారు. గడిచిన రెండేళ్లలో కేవలం రూ.41 లక్షలే విడుదల చేశారు. దీంతో పునాది పనులు, రెండు మరుగుదొడ్లు మాత్రమే నిర్మించి వదిలేశారు.

మరింత పెరిగిన  అవస్థలు...

తగినన్ని తరగతి గదులు లేక పిల్లల్ని వరండాల్లో, చెట్ల కింద కూర్చోపెట్టి చదువు చెప్పే పరిస్థితి ఇకపై ఉండదని భావించిన ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది. పనులు పూర్తికాకపోవడం.. మెటీరియల్‌ తరగతి గదులు, ఆవరణలో ఉండటం వల్ల పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అన్నింటా సగం పనులే...

రెండో దశ నాడు నేడు పనులు ఎక్కడా పూర్తి స్థాయిలో చేసింది లేదు. కొన్ని చోట్ల పునాదుల దశలో నిలిచిపోగా, మరికొన్ని చోట్ల గదులు మాత్రమే కట్టారు. ఫ్లోరింగ్‌, శానిటరీ, తలుపులు, కిటికీల ఏర్పాటు వంటి పనులు ఆగిపోయాయి. 2021-22 విద్యాసంవత్సరంలో రెండో దశ పనులు ప్రారంభించారు. ఏడాదిలో పనులు పూర్తికావాలని జగన్‌ ప్రకటించారు. రెండేళ్లు పూర్తవుతున్నా ఓ కొలిక్కిరాలేదు. దాదాపు యాభై శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. తర్వాత ఒక్క పైసా రాకపోవడంతో హెచ్‌ఎంలు, విద్యాకమిటీ ఛైర్మన్లు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు.

  • ‘అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేస్తాం...’

2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రగల్భాలు

  • నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం...’

అధికారం చేపట్టిన తొలినాళ్లలో చెప్పిన ఊసులు

  • ‘నాడు- నేడు, ఆంగ్ల మాధ్యమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయంటే కారణం మీ జగన్‌...’

 ఇటీవల సభల్లో తనకు తానే భుజాలు చరుకుంటూ కోస్తున్న కోతలు

ఓ పాఠశాలలో మరుగుదొడ్డి కోసం తవ్వి వదిలేసిన గుంత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని