logo

హడావుడి ఎక్కువ.. కొనుగోలు తక్కువ

ధాన్యం కొనుగోలు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తెచ్చింది. కానీ ఆచరణలో మాత్రం పలు అడ్డంకుల వల్ల అన్నదాతలకు అవస్థలు తప్పలేదు.

Updated : 04 Dec 2022 06:20 IST

ధాన్యం చేతికొచ్చినా అమ్ముకోలేని పరిస్థితి  
న్యూస్‌టుడే, నరసన్నపేట, సారవకోట, జలుమూరు

కరగాంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం

ధాన్యం కొనుగోలు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తెచ్చింది. కానీ ఆచరణలో మాత్రం పలు అడ్డంకుల వల్ల అన్నదాతలకు అవస్థలు తప్పలేదు. మిల్లర్ల ప్రమేయం లేకుండా సేకరిస్తామని ఓ మంచి ఆలోచనను అమల్లోకి తెచ్చినా అధికారులు, సిబ్బంది సమన్వయ లోపంతో ఆదిలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని పరిస్థితులే ఇందుకు ఉదాహరణ..  

నియోజకవర్గంలో 68 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జలుమూరు, సారవకోట మండలాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు మండలాల్లో రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. సారవకోట మండలంలో ఆరు, జలుమూరు మండలంలో 8 ప్రాంతాల్లో చేపట్టినా అంతంతమాత్రంగా సాగుతోంది. నరసన్నపేటలో ఒక్కటీ తెరవకపోగా, పోలాకిలో ఒకే ఒకటి తెరిచినా ఒక్క గింజా కొనలేదు. నరసన్నపేట మండలంలో ఇప్పటివరకు 15 మంది రైతులకు ఆర్బీకేల ద్వారా షెడ్యూలు ప్రకటించారు. గతనెల 26న కరగాం, రావులవలస, చిక్కాలవలస వంటి ఆరు గ్రామాల్లోని ధాన్యం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని సిద్ధంగా ఉంచినా ఇప్పటికీ కొనలేదు. మరోవైపు త్వరలో వాయుగుండం ప్రకటనతో అన్నదాతల్లో భయం వెంటాడుతోంది. సారవకోట మండలంలోని పలు కేంద్రాల్లో గత శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతులు రోజంతా ఆయా కేంద్రాల పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు ఇందుకు అవసరమైన డేటాఎంట్రీ ఆపరేటర్ల నియామకం ఇంతవరకు జరగకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.


వారం రోజులుగా కల్లాల్లోనే నిల్వ
- పంగ శ్రీరాములు, రైతు, కరగాం, నరసన్నపేట

గతనెల 26న ధాన్యం కొంటామని ఆర్బీకే నుంచి నాకు సూక్ష్మసందేశం వచ్చింది. దీంతో నేను 200 బస్తాల ధాన్యాన్ని కళ్లాల్లోనే నిల్వ ఉంచాను. వాటిని కాపాడుకోవడం కష్టంగా మారింది. సమాచారం వచ్చి వారం రోజులైనా ఇప్పటివరకు కొనలేదు.


వేగవంతం చేస్తున్నాం
- కె.రవీంద్రభారతి, ఏడీ వ్యవసాయశాఖ

నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే జలుమూరు, సారవకోట మండలాల్లో రైతుల నుంచి సేకరిస్తున్నాం. సాంకేతిక సమస్యలు అధిగమించి ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపడతాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని