logo

నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు.

Published : 23 Apr 2024 03:50 IST

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి నలుగురు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కువగా ఆమదాలవలస అసెంబ్లీ స్థానం నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు పత్రాలు అందజేశారు. పలు నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో సందడి నెలకొంది. టెక్కలి, పలాస, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడంతో ఆయా చోట్ల ఎన్నికల వేడి మరింత పెరిగింది.

టెక్కలి: ర్యాలీలో పాల్గొన్న కూటమి శ్రేణులు

కాంగ్రెస్‌ అయిదుగురు.. స్వతంత్రులు ముగ్గురు..

కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాకుళం నుంచి అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు(ఆమదాలవలస), కె.మల్లేశ్వరరావు(ఎచ్చెర్ల), కె.రమేష్‌(ఎచ్చెర్ల), మంత్రి నరసింహమూర్తి(నరసన్నపేట), స్వతంత్ర అభ్యర్థులుగా మురపాల లక్ష్మి(ఇచ్ఛాపురం), కె.గోవిందరావు (పాతపట్నం), సనపల సురేష్‌ కుమార్‌ (ఆమదాలవలస), బీఎస్పీ తరఫున ఎల్‌.సోమేశ్వరరావు (ఆమదాలవలస), జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా జి.రేవతి(ఆమదాలవలస), భారత పిరమిడ్‌ పార్టీ నుంచి కోనేటి నీలాచలం(ఎచ్చెర్ల), జేబీఎన్‌పీ నుంచి బి.కొర్లయ్య(ఎచ్చెర్ల), నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కె.కామేశ్వరి(నరసన్నపేట) నామపత్రాలను ఆయా రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. 


మంత్రి అప్పలరాజుపై మూడు కేసులు

పలాసలో రిటర్నింగ్‌ అధికారి భరత్‌నాయక్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న మంత్రి అప్పలరాజు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), పలాస, న్యూస్‌టుడే: వైకాపా పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయా పత్రాలను ఆర్డీవో, రిటర్నింగ్‌ అధికారి భరత్‌నాయక్‌కు సోమవారం అందజేశారు. మరోసెట్‌ నామినేషన్‌ను ఆయన భార్య శ్రీదేవి దాఖలు చేశారు. నామపత్రాల్లో భాగంగా మంత్రి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై మూడు కేసులు (ఒకటి రైల్వే పోలీసులు నమోదు చేశారు) అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పలరాజు దంపతుల పేరిట 70.52 లక్షల చరాస్తులున్నాయి. ఇద్దరి పేరిట 2.59 కోట్ల స్థిరాస్తులు, 398 గ్రాముల బంగారం, రూ.85.18 లక్షల రుణాలున్నాయని అందులో పొందుపరిచారు.


నామినేషన్‌ ధరావత్తు చిల్లర రూపంలో అందజేత

శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి బహుజన సమాజ్‌ పార్టీ తరఫున నాయుడుగారి రాజశేఖర్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. చెల్లించాల్సిన ధరావత్తు మొత్తం చిల్లర రూపంలో అధికారులకు అందజేశారు. జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేస్తున్న ఈయన మహాశివరాత్రికి వచ్చిన సంభావనలను ధరవాత్తు కట్టినట్టు వివరించారు.

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (శ్రీకాకుళం)


రెడ్డి శాంతిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు

పాతపట్నంలో రిటర్నింగ్‌ అధికారి అప్పారావుకు నామపత్రాలు అందజేస్తున్న రెడ్డి శాంతి

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), పాతపట్నం, న్యూస్‌టుడే: వైకాపా పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతి నామినేషన్‌ దాఖలు చేశారు. అచ్చుతాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ర్యాలీగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎం.శ్యాంసుందరరావుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి ఎం.అప్పారావుకు పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు చదివిన తనకు రూ.1.70 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1.67 కోట్ల స్థిరాస్తులు, 400 గ్రాముల స్టోన్డ్‌ జ్యూయలరీ, 300 గ్రాముల బంగారం, ఆరు కిలోల వెండి, రూ.47 లక్షల రుణం ఉందని పొందుపరిచారు.


కేసులు లేని కృష్ణదాస్‌

ధర్మాన కృష్ణదాస్‌ పేరిట నామపత్రాలు అందజేస్తున్న కోడలు శ్రావణి తదితరులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: వైకాపా నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్‌ ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేయగా.. సోమవారం మరోసెట్‌ను ఆయన కోడలు శ్రావణి రిటర్నింగ్‌ అధికారి రామ్మోహనరావుకు అందజేశారు. ఇందులో భాగంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి కేసులు లేవని కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. బీకాం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కృష్ణదాస్‌ దంపతుల పేరిట రూ.5.61 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. రూ.3.95 కోట్ల స్థిరాస్తులు, 60 తులాల బంగారం, కిలో వెండి, రూ.3.68 కోట్ల రుణం ఉందని అందులో పొందుపరిచారు.


నామినేషన్‌ వేసిన సభాపతి

ఆమదాలవలసలో రిటర్నింగ్‌ అధికారి నవీన్‌కు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న తమ్మినేని సీతారాం

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం తమ్మినేని సీతారాం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సంయుక్త కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి నవీన్‌కు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని