logo

ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు

ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్‌ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే.

Published : 28 Apr 2024 03:39 IST

ప్రజలకు భారంగా విద్యుత్తు బిల్లులు
కట్టలేకపోతున్నామంటూ అసహనం

పలాస విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో బిల్లు కట్టేందుకు వరుసలో ఉన్న వినియోగదారులు

ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్‌ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. ఐదేళ్లలో పలుమార్లు పెంచేయడంతో వినియోగదారులు విసిగెత్తిపోతున్నారు. యూనిట్ల వాడకంలో మార్పు లేకపోయినా నెల అయ్యేసరికి బిల్లు చూసి కంగుతింటున్నారు.

న్యూస్‌టుడే, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి గ్రామీణం, ఇచ్ఛాపురం

ఇంత తేడా ఊహించలేదు

రెండు బల్బులు, ఒక పంకా వినియోగిస్తాం. గతంలో రూ.100 నుంచి రూ.120 వరకు వచ్చేది. ఇప్పుడు రూ.500 వరకు బిల్లు వస్తోంది. వేసవిలో వినియోగం ఎక్కువైన మాట వాస్తవమే కానీ ఛార్జీల్లో ఇంత తేడా రావడం బిల్లులు పెరుగుదలకు నిదర్శనం.

సావిత్రి(గృహిణి), సన్యాసిపుట్టుగ, కవిటి మండలం

ఇబ్బందులే..

ఐదేళ్లలో విద్యుత్తు ఛార్జీలు పలుమార్లు పెరిగాయి. రూ.250 చెల్లించే మేము. కొన్ని నెలల నుంచి రూ.700 మించి చెల్లిస్తున్నాం. ఏదో ఒక కారణం చెప్పి బిల్లులు పెంచితే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

ఎన్‌.బాబూరావు, లక్కవరం, సోంపేట మండలం

ఐదేళ్ల కిందట ఒకలా..

బెల్లుపడకాలనీలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాను. ఫ్రిజ్‌, ఒక పంకా, మూడు పొదుపు దీపాలు వినియోగిస్తున్నాం. యూనిట్లలో మార్పు లేనప్పటికీ రూ.700 దాటిపోతోంది. ఇటీవల విద్యుత్తు ఆదా చేసే దీపాలు, పంకాలు రావడంతో వాటినే వాడుతున్నాం.. అవి వినియోగిస్తే తక్కువ రావాలి కానీ అలా జరగడం లేదు. ఐదేళ్ల క్రితం రూ.350లోపే ఉండేది.

మల్లా సునీత, చిరువ్యాపారి, ఇచ్ఛాపురం

ఇప్పుడు కష్టమే

మాకు రెండు మీటర్లు ఉన్నాయి. ఒక దానిలో 47 యూనిట్లు వినియోగించగా 219.86పైసలు, రెండోదానిలో 39 యూనిట్లు వినియోగించగా 157.54పైసలతో బిల్లులు వచ్చాయి. దీంతో రెండు బిల్లులు కలిపి రూ.375 చెల్లించాం. గతంలో ఒక ఇంటికి 99 కనీస బిల్లు వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు.

చక్రపాణి, వంట నిర్వాహకుడు, అన్నపూర్ణ ఆశ్రమం వీది, పలాస.

ముక్కు పిండి వసూలు

మాది టెక్కలిపట్నం గ్రామం. ఈ నెల 77 యూనిట్లు వినియోగించాం. రూ.790 చెల్లించాలని బిల్లు వచ్చింది. గతంలో ఇవే యూనిట్లు వాడితే రూ.300 నుంచి 350 వరకు వచ్చేది. ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తోంది.

డి.తులసీ, టెక్కలిపట్నం, పలాస మండలం.

రెండు నెలలకు ఒకసారే మేలు

తెదేపా హయాంలో విద్యుత్తు బిల్లు రెండునెలలకు రూ.180 వచ్చేది. జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత నెలకు రూ.150 చెల్లిస్తున్నాం. దీంతో ఏడాదికి రూ. 1500 ఖర్చు ఎక్కువవుతోంది. గతంలో మాదిరిగానే బిల్లులు వస్తే ప్రయోజనం కలుగుతుంది.

పి.వాసు, రైతు, కుసిపధ్ర జగన్నాథపురం, మందస మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని