logo

వారి చొరవ స్ఫూర్తిదాయకం

గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్‌ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్‌ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

Published : 23 Apr 2024 01:21 IST

ఇబ్బందులున్నా ఓటేసిన గిరజనులు, వృద్ధులు
అలా అందరూ వచ్చి ఉంటే పోలింగ్‌ పెరిగేది

తిరుచ్చి పరిధిలోని దేవరాయనేరి గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్న నారికురవ గిరిజనులు

గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్‌ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్‌ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చెన్నైలోనైతే అత్యంత దారుణంగా పోలింగ్‌ పడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 30-45శాతం మంది ఓటర్లు అసలు ఓటేసేందుకే ఆసక్తి చూపకపోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగానే మారుతోంది. కొందరు ఇబ్బందులొచ్చినా, ప్రాణాలమీదికొచ్చినా.. దేన్నీ లెక్కచేయకుండా ఓటేసినవారున్నారు. ఓటేయనివారు.. కనీసం వారిని చూసుంటే కచ్చితంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేవారేమో అన్న భావన కలుగుతోంది.

ఈనాడు-చెన్నై

చివరికి ప్రాణాలొదిలారు

ఓటుకోసం వచ్చి ప్రాణాలొదిలిన ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. సేలం జిల్లాలో ఆర్‌.చిన్నపొన్ను(77), ఎన్‌.పళనిసామి(65), తిరుత్తణికి చెందిన కె.కనకరాజ్‌(70) ఓటు వేసేందుకు వచ్చి మృతిచెందారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. చిన్నపొన్ను ఓటుకేంద్రంలోకి వెళ్లి గుర్తింపు కార్డు చూపుతూ కుప్పకూలిపోయారు. ఇదే తరహాలో ఎన్నికల అధికారుల ముందు ఓటుకార్డును చూపిస్తూ కనకరాజ్‌ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. అనంతరం వారిద్దరూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. పళనిసామి క్యూలైన్‌లో మృతిచెందారు. ఆరోగ్యం బాగోలేకున్నా, వాతావరణం సహకరించకున్నా.. ఓటు కోసం వాపడిన తపన గుండెల్ని పిండేస్తోంది.

బామ్మ ఓపిక చూడండి

దిండుక్కల్‌ పరిధిలోకి రెడ్డియార్‌ఛత్రం గ్రామానికి చెందిన 102ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. ఆమె పేరు.. చిన్నమ్మాళ్‌. నడవడం కష్టంగా ఉన్నా, నడుము సహకరించకున్నా.. కర్రపట్టుకుని పోలింగ్‌ కేంద్రందాకా నడుచుకుంటూ వచ్చి, క్యూలైన్లలో నుంచున్నారు. ఓటరుకార్డును చూపించి ఓటేశారు. ఆమె ఓపిక, సహనం, ఓటు హక్కు మీద ఆమెకున్న మక్కువ అక్కడున్న వారందరిలోనూ స్ఫూర్తినింపింది. ఆమె పోలింగ్‌కేంద్రానికి వచ్చి వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. విదేశాల్లో సైతం ‘భారతదేశంలో ఈవిడ స్ఫూర్తి చూడండి’ అంటూ ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు.


కొండలెక్కి వచ్చారు

అన్నామలై టైగర్‌ రిజర్వు ఫారెస్టులోని గ్రామాల్లో ఎలాంటి దారులు వేసేందుకూ అనుమతులు రావు. అక్కడివారు ఓటేసేందుకు వెళ్లాలంటే కొండలు, గుట్టలు ఎక్కి కి.మీ. కొద్దీ నడవాలి. అంతటి సాహసం చేసి వారు ఓటేయడం ఎందరినో ఆలోచింపజేసింది. ఆ అడవి పరిధిలోని ముదువన్‌ గిరిజనులు సైతం ఓటేసి సంబరపడ్డారు. వారు సుమారు 40గ్రామాల్లో ఉంటారు. కీల్పూనాచి పరిధిలో ఈ గిరిజనులు ఏకంగా 5 కి.మీ. ట్రెక్కింగ్‌ చేశారు. మొత్తంగా ఆయా గ్రామస్థులు 8-10కి.మీ నడిచారు. ఇలాంటివారు ఎందరికో ఆదర్శంగా ఉన్నారు.


చంటిబిడ్డతో వచ్చి..

కాశిమేడు ప్రాంతంలో ఓటు వేసేందుకు వచ్చిన ఈ మహిళ పేరు శశి. ఈమెను చూసి మీడియా, పోలింగ్‌ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. వారం క్రితం కాన్పు అయిన ఈమె.. బిడ్డను తీసుకుని మరీ ఓటు వేసేందుకు వచ్చారు. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈమె మాటలు వింటే.. ‘ఓటు వేసేందుకు రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. మాకు మేలు చేసే నేతను మేం ఎన్నుకుంటాం. మా భవిష్యత్తు కోసం మేం పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేస్తున్నాం’ అంటారు.

నేతల తీరు మారాలి

20-30 కుటుంబాలు మించిన గ్రామాల్లో ఎన్నికలు బహిష్కరిస్తూ అక్కడి ప్రజలు నిరసనలు తెలిపారు. వారినీ తీసివేయలేదు. నేతలు తమకు ద్రోహం చేశారని, ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఓటు కోసం ఎంతో తపిస్తున్న జనాలకోసం నేతలు వారిచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం బాధాకరం. ప్రజాప్రతినిధులు, పార్టీల తీరును రాజకీయ విశ్లేషకులు సైతం ఖండిస్తున్నారు.


ఏనుగుల భయాన్ని దాటి..

ధర్మపురి పార్లమెంటు స్థానంలో ఓటింగ్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అంతే స్ఫూర్తితో అక్కడి ఓటర్లూ ముందుకొచ్చారు. కొందరు ప్రాణాలకు తెగించి ఓటుకోసం సాహసం చేశారు. కొన్ని గ్రామాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అక్కడి ఏరిమలై పరిధిలోని అలకట్టు గిరిజన గ్రామం ప్రజలు ఓటు సద్వినియోగం చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. వారు ఓటు వేసేందుకు వెళ్లాలంటే 5 కి.మీ. దూరం నడవాల్సిందే. తరచూ ఏనుగుల దాడులు జరిగే ప్రాంతమది. పలువురికి గాయాలూ అయ్యాయి. వారికోసం అక్కడి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ట్రాక్టర్లు ఏర్పాటుచేసింది. ఎన్ని ఏర్పాట్లు చేసినా సహజంగా ప్రాణాలదాకా వస్తే.. ఆలోచించేవారుంటారు. వాళ్లు అలా చేయకుండా.. ధైర్యంగా వెళ్లి ఓటేసి వచ్చారు. ఊరందరికీ అదో మరిచిపోలేని రోజుగా మారింది.


మత్స్యకారుల బారులు..

చెన్నై నగరంలో చాలా పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోయాయి. కాశిమేడులో మాత్రం విపరీతమైన రద్దీ కనిపించింది. అక్కడ వేలాది మత్స్యకార కుటుంబాలున్నాయి. వారంతా ఐక్యంగా ఓటేసేందుకు కుటుంబాలతో సహా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఆవరణలన్నీ రద్దీగా మారిపోయాయి. పోలీసులు సైతం వారిని నియంత్రించడానికి శ్రమించాల్సి వచ్చింది. వారంతా ఓపిగ్గా లైన్లలో నిల్చుని ఓటేయడం స్ఫూర్తిగా నిలిచింది. మిగిలిన నగరంలో ధనవంతులు, మధ్యతరగతి ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు లేక ఖాళీగా ఉన్న సమయంలో.. పేదలున్న ఇక్కడి కాలనీల్లో ఓటు కోసం బారులు కనిపించాయి. ఈ సన్నివేశాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని