logo

సముద్రగర్భంలోకి కార్బన్‌ డయాక్సైడ్‌

భూమిపై పేరుకుపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్‌ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది.

Published : 30 Apr 2024 01:20 IST

ద్రవరూపంలో దాస్తే తప్పనున్న ముప్పు

 భూమిపై పర్యావరణ రక్షణకు ఉత్తమమార్గం

 పరిశోధనలతో బయటపెట్టిన ఐఐటీ మద్రాస్‌

సాగరంలోకి పంపే విధానం (నమూనాచిత్రం)

భూమిపై పేరుకుపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్‌ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. పారిశ్రామిక, నిర్మాణ అభివృద్ధితో పాటు మానవ తప్పిదాలతో వెలువడిన ఉద్గారాలు ఇప్పుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి. ఇలా వచ్చిన మొత్తం కర్బన ఉద్గారాల్ని సముద్రంగర్భంలోకి పంపితే ఎలాంటి హాని ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

ఈనాడు-చెన్నై; హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో 500 మీటర్ల లోతున ఐఐటీ మద్రాస్‌ పరిశోధనలు చేసింది. అక్కడి పరిస్థితుల్ని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత.. కార్బన్‌ డయాక్సైడ్‌ను నేరుగా కాకుండా ద్రవరూపంలోకి మార్చి అడుగుభాగాన నిల్వ చేయొచ్చనే పరిష్కారానికి వచ్చారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ జితేంద్ర సంగ్వాయ్‌, పరిశోధక విద్యార్థి యోగేంద్రకుమార్‌ మిశ్రా ఈ పరిశోధనలో ప్రధాన భూమిక పోషించారు.

దారి చూపిన ‘మీథేన్‌’..

లక్షలాది సంవత్సరాలుగా సముద్రంలో మీథేన్‌ హైడ్రేట్ ఉంది. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు కన్నా శక్తివంతమైంది. ఆశ్చర్యకరంగా ఇది ఇటు బయటి పర్యావరణానికి, అటు సముద్రంలోని జీవులకు ఎలాంటి ప్రమాదానికి గురిచేయడంలేదు. ఇదే పరిశోధకుల్ని ఆకట్టుకుంది. ఆ మీథేనే సముద్రంలో సురక్షితంగా ఉన్నప్పుడు.. భూమిపై పెరిగిపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ను ద్రవరూపంలోకి మార్చి ఎందుకు సాగరంలో నిల్వ ఉంచకూడదు అనుకున్నారు. ఈ అంశం ఆధారంగా పరిశోధనలు మొదలుపెట్టినట్లు ప్రొఫెసర్‌ జితేంద్ర సంగ్వాయ్‌ తెలిపారు.

నిల్వ సామర్థ్యం అమోఘం

ఐఐటీ మద్రాస్‌ పరిశోధనల ప్రకారం సముద్ర గర్భంలో సుమారు 2,800 మీటర్ల లోతున నీటితో పోల్చితే కార్బన్‌ డయాక్సైడ్‌ దట్టంగా ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఈ వాయువుకు గురుత్వాకర్షణ పరిస్థితులు ఉండటం వల్లే అడుగునే నిల్వ ఉంటుందని, అక్కడి నుంచి బయటికెళ్లదని తెలుసుకున్నారు. ఒక్క బంగాళాఖాతంలోనే భూమి మానవచర్యల ద్వారా వ్యాప్తిచెందిన కార్బన్‌ డయాక్సైడ్‌ను వందలాది గిగా టన్నులుగా నిల్వ చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. కార్బన్‌ డయాక్సైడ్‌ను జలరూపంలో సముద్రంలోకి పంపిన తర్వాత తిరిగి వాతావరణంలోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇలా అడుగుకు వెళ్లిన కర్బన ఉద్గారాలు గ్యాస్‌ నైట్రేట్గా మారి ప్రమాదరహితంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ద్రవరూపంలోనే ఎందుకు?

కార్బన్‌ డయాక్సైడ్‌ను నేరుగా సముద్రంలోకి పంపితే జీవరాశులకు చాలా ప్రమాదం. కాబట్టే ద్రవరూపంలోకి మార్చి లోపలికి పంపే ప్రక్రియ ఆలోచించాల్సి వచ్చిందని పరిశోధకుడు యోగేంద్రకుమార్‌ తెలిపారు. ఇదే సురక్షితమైన పద్ధతి అని చెబుతున్నారు. ఇందులో భాగంగా సముద్రగర్భాన ఉన్న మట్టిపై సైతం పరిశోధనలు చేయాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పరిశోధనలు నార్వే, డెన్మార్క్‌ లాంటి దేశాలు విస్తృతంగా చేస్తున్నాయని అన్నారు.

భూమిపై ముప్పు ఇలా..

పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి కర్బన సమస్యలు తీవ్రంగా ఉత్పన్నమవుతూ వస్తున్నాయి. ఓ పక్క పారిశ్రామికవృద్ధి, మరోపక్క మానవ జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతూ వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలతో పాటు నిర్మాణాలు పెరగడంతోనే కర్బన ఉద్ఘారాలు వెలువడటం మొదలయ్యాయి. ప్రపంచవ్యాపంగా 2డిగ్రీల వేడి పెరగడం, 2011 నుంచి 2050 మధ్య 1100 గిగాటన్నుల కార్బన్‌ వెలువడనుండటం ఆందోళనకు గురిచేస్తున్నాయిన పరిశోధకులు తెలిపారు.

రెండు సాగరాలు సురక్షితం

తాము తీసుకొచ్చే విధానాల ద్వారా పర్యావరణ రక్షణకు సరికొత్త పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు వెల్లడించారు. ఇంతకు మించిన సరైన ప్రత్యామ్నాయం లేదని వారు అభిప్రాయపడ్డారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ఇందుకు అనువుగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని