logo

అక్రమ అంతస్తుల్లో కాసుల వర్షం

నగరంలో ఎక్కడైనా అనధికార అంతస్తు నిర్మాణం జరుగుతుంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రం నష్టం వాటిల్లుతోంది.

Updated : 09 Mar 2023 05:29 IST

అధికారులు, ప్రజాప్రతినిధుల చేతివాటం
ఏటా జీవీఎంసీకి రూ.కోట్లలో నష్టం
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

నగరంలో ఎక్కడైనా అనధికార అంతస్తు నిర్మాణం జరుగుతుంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రం నష్టం వాటిల్లుతోంది.

గరంలో 60శాతం వరకు అదనపు అంతస్తులు, అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు అంచనా.. ఆయా నిర్మాణదారులతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నారు. రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటూ, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపెన్‌ స్పేస్‌ ఛార్టీల వసూలులోనూ అవినీతి జరుగుతోందని ఇటీవల కొందరు ఫిర్యాదులు చేయడం గమనార్హం.

* నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారాలు కొనసాగుతున్నా దర్యాప్తు, నిఘా సంస్థలు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి సోమవారం, శుక్రవారం జీవీఎంసీలో నిర్వహించే స్పందన కార్యక్రమాలకు అధికశాతం ఫిర్యాదులు అనధికార కట్టడాలపైనే వస్తున్నాయి. ఆయా ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు వాటిని పరిష్కరించేసినట్లు ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నారు.

* 39వ వార్డులో 267 గజాల స్థలంలో జీప్లస్‌3 తరహా నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులిచ్చింది. ఈ స్థలానికి వీఎంఆర్‌డీఏ ల్యాండ్‌ పొజిషన్‌ ధ్రువీకరణ లేకపోవడంతోపాటు ఓపెన్‌ స్పేస్‌ ఫీజుల కింద నిర్మాణదారు రూ.16.44 లక్షలు జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంది. అతను ఆ మొత్తం ఎగ్గొట్టి   భవనాన్ని పూర్తి చేశారు.

* 42వ వార్డులో జీప్లస్‌2 తరహా నిర్మాణానికి అనుమతులు తీసుకున్న యజమాని అదనపు అంతస్తు వేశారు. దీనికి రూ.52.80 లక్షల విలువైన టీడీఆర్‌ జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంది. ఆ మొత్తం ఇవ్వకుండానే కొందరు అధికారుల అండదండలతో అతను నిర్మాణం పూర్తి చేశారు.

* 38వ వార్డులో జీప్లస్‌4 కట్టడానికి నిర్మాణదారు అనుమతులు పొందారు. రూ.1.31కోట్ల విలువైన స్థలంలో నిర్మాణం పూర్తి చేశారు.. దీనికి 14శాతం చొప్పున రూ.18.42 లక్షలు జీవీఎంసీకి చెల్లించలేదు. గాజువాక 57వ వార్డులో ఓ వ్యక్తి జీప్లస్‌4 తరహా నిర్మాణం చేపట్టారు. సదరు స్థలానికి వుడా ఎల్పీ నెంబరు లేకపోవడంతోపాటు ఓపెన్‌ స్పేస్‌ కోసం 14 శాతం నిధులు రూ.25.14 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం చెల్లించకుండానే నిర్మాణం పూర్తి చేశారు. 56వ వార్డులో 2333 గజాల స్థలంలో నిర్మించిన అపార్టుమెంటు విషయంలోనూ ఇలాగే జరిగింది.

* పెందుర్తి 70వ వార్డులో నిర్మించిన ఓ భవనానికి యజమాని 14శాతం రుసుము రూ.3.57 లక్షలు చెల్లించకపోగా, అదనపు అంతస్తు వేశాడు. తద్వారా జీవీఎంసీకి రూ.12.25 లక్షల నష్టం వాటిల్లింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్మాణదారులతో కుమ్మక్కు కావడంతో ఏటా రూ.కోట్లలో జీవీఎంసీ రాబడి కోల్పోతోంది. మరో వైపు ఖర్చులు పెరిగిపోతుండడంతో ప్రజలపై పన్నుల భారం మోపాల్సి వస్తోంది.


ఇవిగో ఉదాహరణలు..

జీవీఎంసీ 33వ వార్డులో 410 గజాల స్థలంలో జీప్లస్‌3 తరహా నిర్మాణానికి అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణదారు మరో అంతస్తు అక్రమంగా నిర్మించారు. దీనికిగాను స్థలం మార్కెట్‌ విలువ రూ.1.96 కోట్లలో 50 శాతం రూ.98,40,000 విలువైన టీడీఆర్‌ (అభివృద్ధి బదలాయింపు హక్కు) పత్రాలు జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంది. అధికారుల తీరు కారణంగా జీవీఎంసీకి రూ.98లక్షల నష్టం వాటిల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని