logo

పేదల పొట్టకొట్టిన జగమొండి

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు.

Published : 04 May 2024 03:09 IST

ఎంతో మంది ఆకలితీర్చిన అన్న క్యాంటీన్ల మూత…
అనకాపల్లి పట్టణం, నర్సీపట్నం అర్బన్‌, ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. తెదేపాకు పేరు దక్కకూడదన్న అక్కసుతో కష్టజీవుల ఆకలి కేకలు వినిపించుకోకుండా కర్కశత్వం ప్రదర్శించారు.  తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ. 5కే అల్పాహారం, భోజనం అందించేవారు. జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లోని పేదలు, చుట్టుపక్కల పల్లెల నుంచి అవసరాల నుంచి నిమిత్తం వచ్చే బడుగుజీవుల ఆకలి తీర్చడంలో ఇవి ఎంతో ఉపయోగపడేవి. వైకాపా అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లపై కక్షపూరితంగా వ్యవహరించింది. వాటిని బలవంతంగా మూసేసి అన్నమో రామచంద్రా అని అలమటించేలా చేసింది.

  • నర్సీపట్నంలో అన్ని వర్గాల పేదలకు అనుకూలంగా ఉండేలా మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా భవనం నిర్మించి అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయించారు. ప్రాంతీయ ఆసుపత్రికి రోగుల వెంట సహాయకులుగా వచ్చేవారు. ఆ మార్గంలో ప్రయాణించే ఆటో డ్రైవర్లు, సమీపంలోని నిరుపేదలు, విద్యార్థులు ఇలా రోజూ వందల మంది ఇక్కడ ఆకలి తీర్చుకునేవారు. ఈ క్యాంటీన్‌ ప్రారంభించింది మొదలు వైకాపా ప్రభుత్వం మూసేసేవరకు 54,969 మంది అల్పాహారం, 94,085 మంది మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశారు. తెదేపా ప్రభుత్వం మూడుపూటలకు కలిపి రూ. 73 వరకు వెచ్చించేదని సమాచారం. పేదల నుంచి మాత్రం రూ. 15 మాత్రమే తీసుకునేది. ఇదే భోజనం, అల్పాహారం మూడుపూటలా బయట తింటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. తక్కువ మొత్తానికే పేదలు కడుపునిండా కమ్మని భోజనం చేసేవారు. రోజుకు 350 మందికి అల్పాహారం, 350 మందికి మధ్యాహ్న భోజనం, 250 మందికి రాత్రి భోజనం తయారు చేయించి అందుబాటులో ఉంచేవారు. వైకాపా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత క్యాంటీన్‌ మూసేయడంతో పేదలంతా ఇబ్బంది పడుతున్నారు.  

  • అనకాపల్లిలో రైల్వేస్టేషన్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి వద్ద 2018లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ ఆసుపత్రికి జిల్లావ్యాప్తంగా వచ్చే రోగుల సహాయకులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ షాపింగ్‌ మాల్స్‌లో పని చేసుకునేవారు, రిక్షా కార్మికులు, ప్రయాణికులు ఇలా ఎంతోమందికి ఇవి ఆకలి తీర్చేవి. వీటి కోసం భవనాలు నిర్మించి ఆధునిక హంగులు కల్పించారు. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకి 200 నుంచి 300మంది వరకు ఫలహారం, భోజనాలు చేసేవారు. జగన్‌ సర్కారు వీటిని నిర్దాక్షిణ్యంగా మూసేసింది. రైల్వేస్టేషన్‌ క్యాంటీన్‌ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. భవనం తలుపులు, కిటికీలు పాడైపోయాయి. దీన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ భవనాన్ని కొవిడ్‌ సమయంలో పరీక్షలు చేయడానికి ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌గా మార్చారు. ల్యాబ్‌ను ప్రారంభించిన కొన్ని నెలలకే మూసేశారు. నియమించిన సిబ్బందిని తొలగించారు. ప్రస్తుతం భవనంలో పరికరాలు మాత్రమే ఉన్నాయి.
  • ఎలమంచిలి పట్టణంలో జానియర్‌ కళాశాల సమీపంలో పాత జాతీయ రహదారిపై అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. రోజూ 350 మంది వరకు గ్రామాల నుంచి ఎలమంచిలి వచ్చే ప్రజలు, చిరు వ్యాపారులు, కార్మికులు, కళాశాలకు వచ్చే పేద విద్యార్థులు ఇక్కడే అల్పాహారం, భోజన చేసేవారు. వైకాపా పాలనలో దీనిని మూసేశారు. ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చారు.


ఆకలి బాధ తీరుస్తున్న అయ్యన్న

పేదల ఆకలి బాధలు తెలిసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. దాదాపు 250 రోజుల నుంచి ఓ వ్యాన్‌ సమకూర్చి అందులో రూ. 2కే అన్నం, కూర, సాంబారు, స్వీట్‌, పెరుగు అందజేస్తున్నారు. పాత అన్న క్యాంటీన్‌ వద్ద వారానికి మూడు రోజులు, బీసీ కాలనీ, మరిడిమాంబ ఆలయం వద్ద మూడు రోజులు వ్యాన్‌ పేదలకు అందుబాటులో ఉంటోంది.

ఎలమంచిలిలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు ముందుకు వచ్చి కొన్ని రోజులపాటు తెదేపా కార్యాలయం ముందు మధ్యాహ్నం అన్న క్యాంటీన్‌ పేరుతో భోజనాలు అందించారు. ఎన్నికల నియమావళితో ప్రస్తుతం విరామం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే క్యాంటీన్‌ తెరుస్తామని నాయకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని