TS News: ఎవరేమనుకుంటే మాకేంటి? మా షాపింగ్ కాంప్లెక్సు.. మా ఇష్టం..
తక్కువ ధరకే లీజు ఖరారు చేయడానికి సిద్ధం
హనుమకొండ కొత్త బస్టాండ్ కూడలిలో కుడా కాంప్లెక్సు
కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఎవరేమనుకుంటే మాకేంటి? మా షాపింగ్ కాంప్లెక్సు.. మా ఇష్టం అనే పద్ధతిలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) అధికారుల తీరు ఉంది. తక్కువ ధరకే హనుమకొండ కొత్త బస్టాండ్ కాంప్లెక్సు లీజు ఖరారు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. రెండున్నర నెలలుగా పక్కన పెట్టిన లీజు దస్త్రం చకచకా కదులుతోంది. అధికారపక్షం కార్పొరేటర్‌కు వాణిజ్య భవనం అప్పగించేందుకు సర్వం సిద్ధమవుతోంది. జిల్లా క్రీడల శాఖ స్థలంలో సుమారు రూ.3.50 కోట్లు వెచ్చించి ఈ భవన సముదాయం నిర్మించారు. లీజు ప్రతిపాదనల పేరుతో కుడా అధికారులు రెండున్నరేళ్లు పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖాధికారుల ఆదేశానుసారం లీజు కోసం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ఏకపక్షంగా సాగిందని, ఒక్కరే వేలం పాడితే ఎలా ఆమోదిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వేలంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నప్పటికీ మిగిలిన ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. కార్పొరేటర్ ఒక్కరే వేలం పాడారు. చదరపు అడుగుకు రూ.15 ధర ఖరారైంది. సుమారు 60 వేల చదరపు అడుగులు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే నెలకు రూ.9 లక్షల అద్దె వస్తుంది. ఇందులో సగం కుడాకు సగం క్రీడల శాఖ దక్కనుంది. తక్కువ ధరకే ఖరారు చేయబోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా అవేమీ పట్టించుకోకుండా అధికారులు లీజు ఒప్పందానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. పక్కన పెట్టిన దస్త్రం కదిలించేందుకు పదవీ విరమణ పొందిన పాలకవర్గం పెద్దలు చక్రం తిప్పారని ప్రచారం సాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.