logo

చెల్పూరు.. ప్రగతి జోరు

ఉమ్మడి జిల్లాలోనే ఏ గ్రామానికి లేని విశిష్టత చెల్పూరుకు ఉంది. భూపాలపల్లి జిల్లాకు అతి దగ్గరి ప్రాంతం కావడం.. ప్రభుత్వ భూములు ఉండడంతో అన్ని వనరులు సమకూరుతున్నాయి.

Published : 07 Dec 2022 05:25 IST

పారిశ్రామిక కేంద్రం.. వైద్య విద్యకు నిలయం
న్యూస్‌టుడే, గణపురం(భూపాలపల్లి జిల్లా)

కేటీపీపీ

ఉమ్మడి జిల్లాలోనే ఏ గ్రామానికి లేని విశిష్టత చెల్పూరుకు ఉంది. భూపాలపల్లి జిల్లాకు అతి దగ్గరి ప్రాంతం కావడం.. ప్రభుత్వ భూములు ఉండడంతో అన్ని వనరులు సమకూరుతున్నాయి. ఇప్పటికే కేటీపీపీ 1100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు ఉపరితల, భూగర్భ గనులు దీని పరిసరాల్లోనే ఉన్నాయి.. 8వ గని ఇక్కడే ఉంది. తాజాగా చెల్పూరులో వైద్య కళాశాల, ఆయుర్వే ఆసుపత్రిని వేరువేరుగా నిర్మిస్తున్నారు. ఫలితంగా మరో ఏడాదిలోనే చెల్పూరు మరింత పెద్ద పట్టణంగా వెలుగొందనుంది.

క్వార్టర్లు, కార్యాలయాలు

ఇప్పటికే ఇక్కడ సింగరేణి కార్మికులు నివసించేందుకు వెయ్యి క్వార్టర్లను నిర్మించారు. దీని పక్కనే మరో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. మండలంలోని మాధవరావుపల్లి సింగరేణి నిర్వాసిత గ్రామాన్ని ఆర్‌ఆర్‌ ప్యాకేజీ(పునరావాస పథకం) కింద ఇక్కడికి తరలించారు. త్వరలో కేటీపీపీ నిర్వాసిత గ్రామమైన దుబ్బపల్లిని తరలించనున్నారు. దీంతో ఇక్కడ జనావాసం పెరిగిపోనుంది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. సింగరేణి వంద అడుగుల తారు రోడ్డును 8వ గని దాకా ఏర్పాటు చేయడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఇక్కడికి భూపాలపల్లి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.. చెల్పూరులోనే జిల్లా ఆర్టీఏ కార్యాలయం ఉంది. జిల్లా మత్స్య శాఖ కార్యాలయం, తపాలా శాఖ కార్యాలయాన్ని చెల్పూరులోనే ఏర్పాటు చేశారు. వెయ్యి క్వార్టర్ల సమీపంలో ఈ ఏడాది మే 9న మంత్రి హరీశ్‌రావు ఇక్కడ మెడికల్‌ కళాశాల, వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయగా ఆ పనులు చకచకా పూర్తవుతున్నాయి. ఇందులో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. రూ.75 కోట్లతో నిర్మిస్తున్నారు. మరో రూ.15 కోట్లతో దీని పక్కనే ఆయుర్వేద కళాశాల, వైద్యాస్పత్రికి గత నెల 30న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా పునాదుల దశలో ఉన్నాయి. ఇందులో 50 పడకల ఆస్పత్రిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని బస్వరాజుపల్లి శివారు చెల్పూరు ప్రాంతానికి దగ్గరగా ఉన్న 8వ భూగర్భ గని ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి దీని ద్వారా రోజుకు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దీనికి సమీపంలోని ఓసీ-3 నుంచి రోజుకు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. రోజుకు సగటున 7 వేల టన్నుల బొగ్గు వీటి ద్వారా రాగా దీన్ని కేటీపీపీకి రవాణా చేస్తారు.

చెల్పూరు శివారులో నిర్మాణమవుతున్న మెడికల్‌  కళాశాల, ఆస్పత్రి భవనాలు

ఉమ్మడి జిల్లాలోనే వెలుగులు

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కూడా చెల్పూరులోనే ఉంది. 2006లో దీనికి బీజం పడగా అప్పట్లో ఈ ప్రాజెక్టు కోసం 999 ఎకరాలను జెన్‌కో సేకరించింది. దుబ్బపల్లి గ్రామం ఖాళీ అయితే మరో 350 ఎకరాలు కలవనున్నాయి. కేటీపీపీ ద్వారా రోజుకు 1100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఓ వైపు పారిశ్రామిక ప్రాంతం, మరోవైపు వైద్య విద్య కళాశాలలు, జిల్లా కార్యాలయాలు ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామంలోనూ లేదని చెల్పూరువాసులు అంటుంటారు. గణపురం పేరుకే మండల కేంద్రమైన చెల్పూరు మాత్రం రోజురోజుకు పట్టణంగా వెలుగొందుతోంది. ఇంకా ఎన్ని కార్యాలయాలు ఇక్కడికి రానున్న రోజుల్లో వస్తాయేమోనని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని