logo

మార్కెట్‌లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా

జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్‌ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌ గేటు ముందు ధర్నా నిర్వహించారు

Published : 23 Apr 2024 04:07 IST

జనగామ, న్యూస్‌టుడే: జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్‌ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌ గేటు ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం మార్కెట్‌కు ధాన్యం తెచ్చిన రైతులను లోనికి అనుమతించలేదు. దీంతో రైతులు, అడ్తీ, ఖరీదు హమాలీలు, దడువాయిలతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. జనగామ సీఐ రఘుపతి, ఎస్‌ఐ సృజన్‌, తిరుపతి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేంద్ర, మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌లతో వారు తమ ఇబ్బందులను వివరించారు. తమకు పని చూపించాలని మహిళా కార్మికులు దండాలు పెట్టారు.

బంద్‌తో ఉపాధి కరవు..

 ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి తె.రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు మోకు కనకారెడ్డి మాట్లాడారు. మార్కెట్లో వ్యాపారులు, హమాలీలకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించడానికి బదులుగా మార్కెట్‌ బంద్‌పెట్టడంతో కూలీలకు ఉపాధి కరవైందన్నారు. ఇదే అదనుగా మిల్లర్లు, చిల్లర కాంట దుకాణదారులు, రూ.1600కు క్వింటా ధాన్యాన్ని ఖరీదు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సీపీఎం అనుబంధ సంఘాల నాయకులను అదుపులోనికి తీసుకున్నారు. సొంత పూచికత్తుపై వారిని విడిచిపెట్టిన తదుపరి రైతు సంఘం ముఖ్య నాయకులు అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ను కలిసి వివిధ డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. మార్కెట్‌ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమాలలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రామావత్‌ మీట్యానాయక్‌, సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

 జనగామ వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్వింటాలు ధాన్యం కనీస ధర రూ.1825 తో ఖరీదు చేసేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఈ విషయమై సోమవారం రాత్రి స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో రైతు సంఘాలు, ఖరీదు, అడ్తీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్లో ప్రైవేటు క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు.

క్రయవిక్రయాలకు కలెక్టర్‌ ఆమోదం

జనగామ: మార్కెట్లో లావాదేవిల కొనసాగింపునకు వివిధ వర్గాల నుంచి పెరిగిన వత్తిడి, రైతుల అవసరాలు, అకాల వర్షాలతో రైతుల ఇబ్బందుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ దృష్టిసారించారు. ఈ నెల 10న యార్డులో రైతుల ఆందోళన తదనంతర పరిణామాల నేపథ్యంలో 16 నుంచి మార్కెట్‌ను మూసివేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మార్కెట్‌ బంద్‌ ప్రకటించినా రైతులు కొందరు సోమవారం సరకులు తెచ్చారు. మరోవైపు మార్కెట్‌ కార్మికులు, వ్యాపారులు క్రయవిక్రయాల అనుమతి కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్ని వర్గాలకు మేలు జరిగేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మార్కెటింగ్‌ అధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి సైతం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వీటన్నింటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో, అదనపు కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మార్కెట్‌యార్డు పునఃప్రారంభానికి కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. ముందుగా యార్డులోని ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఖరీదుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుబాటులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేని గ్రామాల రైతులు నాణ్యతా ప్రమాణాలతో మార్కెట్‌కు ధాన్యం తెచ్చి విక్రయించుకోవచ్చునని ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ప్రకటించడంతో, మార్కెట్‌ గేట్లను తెరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని