logo

17 నెలలు 17 కి.మీ!

జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్‌ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది.

Published : 29 Apr 2024 04:27 IST

జాతీయ రహదారి పనులకు మోక్షమెప్పుడో!

మహదేవపూర్‌-కాళేశ్వరం మధ్య జాతీయ రహదారి 353సీ విస్తరణలో కోల్పోతున్న అటవీ ప్రాంతం

జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్‌ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. ఈ రహదారి విస్తరణ పనులు గుడెప్పాడ్‌ నుంచి మహదేవపూర్‌ వరకు మూడేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కాళేశ్వరం- మహదేవపూర్‌ మధ్య 17 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు 17 నెలల కిందట ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మోక్షం కలగడం లేదు.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, కాళేశ్వరం

జాతీయ రహదారి 353సీˆ తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి కూడా రాకపోకలు సులభంగా సాగించవచ్చు. కాళేశ్వరం వద్ద గోదావరిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో ఈ రహదారిపై రాకపోకలు మరింత పెరిగాయి. 353సీ రహదారి అంతటా బాగున్నా.. కాళేశ్వరం- మహదేవపూర్‌ మధ్య మాత్రం ఇరుగ్గా మారింది. 2022 నవంబరు 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడమేగాక,  రూ.163 కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం- మహదేవపూర్‌ రహదారికి కూడా శంకుస్థాపన చేశారు.పదిహేడు నెలలు గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

22 నుంచి.. 16 మీటర్లకు కుదింపు..

జాతీయ రహదారిని 22 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో చెట్లు కోల్పోవాల్సి వస్తుందని, 16 మీటర్ల వరకే సరిపెట్టాలని అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఒక వైపు జెన్‌కో నీటి సరఫరా పైపులైను ఉండటంతో విస్తరణకు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఏడాది కిందటే విస్తరణలో కోల్పోనున్న చెట్లను లెక్కించి నంబర్లు కూడా వేశారు. వృక్షాలకు సంబంధించి డబ్బులు, భూమికి బదులు భూమి అటవీ శాఖకు ఇవ్వాలి. ఇటీవల చిట్యాల, గణపురం మండలాల్లో 21 హెక్టార్ల భూమిని కూడా కేటాయించినట్లు తెలిసింది. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేలు చేపట్టి అప్పగించాల్సి ఉంది. ఇప్పటికీ పనులు మాత్రం పట్టాలెక్కలేదు.

2 కిలోమీటర్ల పరిధిలో స్పష్టత కరవు..

కాళేశ్వరం శివారు నుంచి అంతర్రాష్ట్ర గోదావరి వంతెన వరకు దాదాపు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణపై ఇప్పటికీ స్పష్టత కరవైంది. మూడు చోట్ల ప్రతిపాదన చేసినా స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బస్టాండు నుంచి పాతరోడ్డు మార్గంలోనా లేక ముక్తివనం పక్క నుంచి విస్తరించడమా అనేది తేల్చలేకపోతున్నారు.

మరమ్మతులతో సరి..

మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం మధ్య వాహనాల రద్దీతో రహదారికి గుంతలు పడుతున్నాయి.  వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కుదురుపల్లి వద్ద వంతెన దెబ్బతిని ప్రమాదభరితంగా మారింది. కనీస రక్షణ కరవైంది. ఈ రహదారి వెంట తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వచ్చే భక్తులకు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి అవస్థలు తప్పడం లేదు.

భూముల కేటాయింపు ప్రక్రియ సాగుతోంది

కృష్ణారెడ్డి, ఇన్‌ఛార్జి ఈఈ, జాతీయ రహదారులు

జాతీయ రహదారి విస్తరణ నిమిత్తం కావల్సిన అటవీ అనుమతులు దాదాపు పూర్తయ్యాయి. అటవీ భూములకు బదులుగా మరోచోట కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తికాగానే పనులు చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని