logo

‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్‌’

అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 29 Apr 2024 04:28 IST

మహాముత్తారం : బోర్లగూడెంలో మాట్లాడుతున్న భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

మహాముత్తారం, పలిమెల, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జయశంకర్‌ జిల్లాలోని మహాముత్తారం మండలం బోర్లగూడెంలో, పలిమెల మండలం పంకెనలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు బంధు పెంపు, రెండు లక్షల రుణమాఫీ, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, పింఛను పెంపు హామీలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. నిరంతర విద్యుత్తు సరఫరా నుంచి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు లేక పంటలు ఎండుతున్న తీరు బాధ కలిగిస్తోందని అన్నారు. మేడిగడ్డ పేరుతో కేసీఆర్‌ను ప్రజల్లో తక్కువ చేయాలని గోదావరిలో నిల్వ ఉన్న 10 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. మారుమూల మండలమైన మహాముత్తారంలో భారాస అధికారంలోకి వచ్చాకే మౌలిక వసతులు మెరుగైన మాట వాస్తవం కాదా అని అన్నారు. కాకా కుటుంబానికే కాంగ్రెస్‌ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను ఏళ్లుగా కేటాయిస్తోందని, రిజర్వేషన్‌ ఆ ఒక్క కుటుంబానికి సొంతమా అని ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటలు వింటూ కనీసం ఠాణాల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించడం లేదని, కాంగ్రెస్‌ నాయకులు చెబితేనే కేసులు పెడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. తనకు ఓటేసి గెలిపిస్తే ప్రజల తరఫున పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారానికి గళం వినిపిస్తానని ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో మహాముత్తారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు రాము, ఎంపీటీసీలు అర్జయ్య, వసంత, పలిమెల మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, నాయకులు జక్కు రాకేశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని