logo

ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!

వారంతా ఇప్పుడు లోక్‌సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

Published : 29 Apr 2024 04:37 IST

ఉభయ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న మనవారు

వారంతా ఇప్పుడు లోక్‌సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కొందరు రాజకీయాల్లో ముందు నుంచీ ఉన్నవారు. మరికొందరు అధికారులుగా అపార అనుభవం సాధించినవారు. అందరికీ ఉమ్మడి వరంగల్‌తో అనుబంధం ఉంది.  ఇందులో ఓరుగల్లులో పుట్టి పెరిగిన వారు కొందరైతే, ఇక్కడ ఉన్నత చదువులు చదివిన వారు, ఈ ప్రాంతంలో ఉన్నత పదవుల్లో కొనసాగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగిన మన వారిపై ప్రత్యేక కథనం.

ఈనాడు, వరంగల్‌


హనుమకొండ స్వస్థలం

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి స్వస్థలం హనుమకొండ నగరంలోని కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీ. సెయింట్ పాల్స్‌ హైస్కూల్‌ హనుమకొండలో పదో తరగతి వరకు చదివారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లో చదువుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాక పౌల్ట్రీ పరిశ్రమల వ్యాపారంలోకి అడుగుపెట్టి వ్యాపారవేత్తగా ఎదిగారు. 2019లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా భారాస నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. రంజిత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్‌లో అనేక మంది బంధుమిత్రులు ఉన్నారు.

హనుమకొండలో తన చిన్ననాటి స్నేహితులతో రంజిత్‌రెడ్డి


బలపాల బిడ్డ

భారాస ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు సొంతూరు మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని బలపాల. ఆయన 8వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నారు. అప్పుడు వీరిది నిరుపేద కుటుంబం. ఉపాధి కోసం పాల్వంచకు వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన నామా వ్యాపార రంగంలో స్ధిరపడ్డారు. 2004లో తెదేపా నుంచి ఖమ్మం బరిలో నిలిచి ఓటమి చెందారు. 2009లో ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లో భారాస తరఫున పోటీ చేసి గెలిచారు.. నామాకు బలపాలలో ఇల్లు ఇప్పటికీ ఉంది. ఆయన ప్రత్యేక సందర్భాల్లో స్వగ్రామం వచ్చివెళుతుంటారు.

గ్రామంలో నామా నాగేశ్వరరావు ఇల్లు

న్యూస్‌టుడే, కురవి


తండ్రి ఊరు ఏనుగల్లు

కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు వరంగల్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయన జన్మించింది కరీంనగర్‌ జిల్లాలోనే అయినా వీరి తండ్రి స్వస్థలం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామం. వినోద్‌కుమార్‌ న్యాయవిద్యను అభ్యసించాక వరంగల్‌ న్యాయస్థానంలో అనేక సంవత్సరాలు వకీలుగా ప్రాక్టీస్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ వరంగల్‌ కేంద్రంగా పనిచేశారు. 2004లో హనుమకొండ ఎంపీగా అప్పటి తెరాస నుంచి పోటీ చేసి గెలుపొందారు.


జిల్లాల విభజన తర్వాత

మల్కాజ్‌గిరి భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండతో రాజకీయ అనుబంధం ఏర్పడింది. ఆయన స్వస్థలం కమలాపూర్‌ మండలం. ఇది హుజూరాబాద్‌ నియోజకవర్గంలోకి వచ్చినా ఈ ఒక్క మండలం హనుమకొండ జిల్లాలో విలీనమైంది.  తెరాస ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉద్యమకారుడిగా పనిచేశారు. కమలాపూర్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఈటల 2004 నుంచి 2010 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి 2021 వరకు భారాస నుంచే హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2021లో జరిగిన ఉప ఎన్నికలో భాజపా తరఫున గెలుపొందారు. 2023లో ఈటల భాజపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు లోక్‌సభకు ప్రయత్నిస్తున్నారు.


వారసుడిగా రాజకీయాల్లోకి

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి స్వస్థలం ఖమ్మం అయినా ఉమ్మడి వరంగల్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి వరంగల్‌ ఎంపీగా 1967, 1989, 1991 మూడు సార్లు గెలుపొందారు. మహబూబాబాద్‌ జిల్లా మాదవాపురంలో వీరికి సొంతిల్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి. తండ్రికి రాజకీయ వారసుడిగా ఇప్పుడు రఘురామరెడ్డికి ఎంపీగా అవకాశం దక్కింది.


నిట్‌ అ‘పూర్వ’ విద్యార్థులు

వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌) విద్యనభ్యసించిన ఇద్దరు పూర్వ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి బరిలో ఉన్నారు. ఇందులో ఒకరు శాసనసభకు కాగా, మరొకరు లోక్‌సభ స్థానానికి. ఇద్దరూ విశ్రాంత ఐపీఎస్‌ అధికారులే.

అంచెలంచెలుగా ఎదుగుతూ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై భారత్‌ పార్టీ నుంచి సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరంగల్‌తో ఎంతో అనుబంధం ఉంది.  నిట్లో 1986లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.  అనంతరం సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అంచెలంచెలుగా ఎదుగుతూ సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. లక్ష్మీనారాయణ తరచూ వరంగల్‌కు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తుంటారు.


బాపట్ల నుంచి పోటీకి సై..

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి తెదేపా టికెట్‌ పొంది బరిలో నిలిచిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌ కూడా నిట్ పూర్వ విద్యార్థి. ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాలగా ఉన్నప్పుడు 1983లో ఆయన ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సివిల్స్‌లో ఐపీఎస్‌ సాధించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలకు ఎస్పీగా, ఇంకా ఉన్నత హోదాలో పోలీసు అధికారిగా సేవలందించారు. ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి వరంగల్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌ (ఎస్సీ) స్థానం నుంచి ఈ సారి భాజపా టికెట్టు ఆశించారు.   తెదేపా అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించి బాపట్ల నుంచి అవకాశం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని