logo

మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్‌సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు.

Published : 30 Apr 2024 03:16 IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నిలువెత్తు చిత్రపటంతో  ఓ మహిళా కార్యకర్త

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌:  ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్‌సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. పార్టీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ విజయం కోరుతూ నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా హాజరై ప్రసంగించారు. దేశంలో మూడోసారి  మోదీ నేతృత్వంలో భాజపా అధికారంలోకి రాబో తుందని.. మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి ఆచార్య సీతారాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.  ఈ ప్రాంతంలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ గిరిజన నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

మాట్లాడుతున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వేదికపై ఎడమ నుంచి  పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, లోక్‌సభ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు,  జిల్లా అధ్యక్షుడు  వై.వెంకటేశ్వర్‌రావు, పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రభారీలు నూకల వెంకటనారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు

25 నిమిషాలు ముందుగానే

మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సభలో పాల్గొన్న జేపీ నడ్డా షెడ్యూల్‌ ప్రకారం మహబూబాబాద్‌కు మధ్యాహ్నం 2:45కు రావాలి. నిర్ణీత సమయానికి కంటే 25 నిమిషాల ముందుగానే వేదిక వద్దకు వచ్చారు. అభ్యర్థి సీతారాంనాయక్‌ తర్వాత నడ్డా  అరగంట  ప్రసంగించారు.
* అభివృద్ధి తప్ప నాకు మరో ధ్యాస లేదు.  ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత  అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు సేవకుడిగా పని చేస్తాను.           -  అజ్మీరా సీతారాంనాయక్‌, భాజపా అభ్యర్థి


మారుమోగిన మోదీ నినాదం

మోదీ పాలనలో దేశంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి..   ఎంతో కాలంగా ఎదురుచూసిన రామమందిరం నిర్మించుకున్నాం.. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాం.. అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తుండగా ప్రజలు ఒక్కసారిగా మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలలో సభాప్రాంగణం మార్మోగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని