logo

చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు

జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

Updated : 20 Apr 2024 06:46 IST

ముదినేపల్లి పాఠశాలలో ...

‘అన్నం మెతుకులు లావుగా ఉంటున్నాయి. తింటే కడుపులో నొప్పి వస్తోంది. తినలేక ఇంటికి వెళ్లి తింటున్నాం.’ ఓ విద్యార్థిని మాటలివి.

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు 277 మంది పిల్లలున్నారు. శుక్రవారం పాఠశాలకు 167 మంచి వచ్చారు. అందులో భోజనం చేసింది 150 మంది అని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. వాస్తవంగా 100 మందిలోపే భోజనం చేశారు. ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ పెట్టలేదు. చాలా చోట్ల తినేందుకు అనువైన స్థలం, తాగేందుకు నీరు, చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యం లేకపోవడం గమనార్హం. వంట తయారీ షెడ్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఆగిరిపల్లి మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 50 ఉన్నాయి. అందులో 7,630 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం పాఠశాలకు 6,837 మంది విద్యార్థులు వచ్చారు. అయితే ప్రభుత్వ గణాంకాల్లో ఎక్కువ మంది విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తక్కువ మంది పాఠశాలల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది.

అడవినెక్కలంలో 150 మంది విద్యార్థులకు వండిన అన్నం, పప్పు


ఆగిరిపల్లి, ముదినేపల్లి, న్యూస్‌టుడే: జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బడులు ఒంటి పూట పనిచేస్తున్న తరుణంలో అన్నం వద్దంటూ మండుటెండలో ఇంటి ముఖం పడుతున్నారు. శుక్రవారం ‘న్యూస్‌టుడే బృందం’ పరిశీలించగా..


మెనూలో ఉండాల్సింది
అన్నం, ఆకుకూర పప్పు,  ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కీ

కానీ

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో గుడ్లు, చిక్కీలు లేవు
ముదినేపల్లి జడ్పీ పాఠశాలలో చిక్కీలు లేవు


ముదినేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 348కి 202 మంది హాజరవగా 35 మంది మాత్రమే భోజనం చేశారు. మిగిలిన వారంతా Ëఇంటి బాటపట్టారు. చిక్కీలు మాత్రం ఇవ్వలేదు. సరఫరా లేదని చెబుతున్నారు. అన్నం చిమిడి పోతోందని తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు వాపోయారు. కొత్త బియ్యం కారణమని, నాలుగు నెలల నుంచి అసంపూర్తిగా బిల్లులు వస్తున్నాయని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.


గోరుముద్దలో ఎగనామం

జగన్‌ మామయ్య మాటలు కోటలు దాటాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గత 15 రోజులుగా రాగిజావతో పాటు మధ్యాహ్న భోజనంలో గుడ్డు, వేరుశనగ చిక్కీలు  మాయమయ్యాయి. పాఠశాలకు బియ్యంతో పాటు రాగిపిండి, బెల్లం, వేరుశనగ చిక్కీలు, గుడ్లు సరఫరా అయ్యేవి. కానీ ప్రస్తుతం బియ్యం ఒక్కటే వస్తోంది. మెనూ ప్రకారం సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు చిక్కీ అందించాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు అయిదు రోజులు గుడ్డు అందించాలి. వాటి సరఫరా లేక విద్యార్థులకు వేరుశనగ చిక్కీ, గుడ్డు అందించడం లేదు. రోజూ రాగిజావ అందించాలి రాగిపిండి, బెల్లం సరఫరా లేక అది పిల్లలకు అందడం లేదు. రాగిపిండి, బెల్లం ప్యాకెట్లు, వేరుశనగ చిక్కీలు, గుడ్లు సరఫరా నిలిచిపోయింది. దాంతో విద్యార్థులకు అందడం లేదు అని ఆగిరిపల్లి ఎంఈవో కె.ఆనంద్‌ కుమార్‌  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని