logo

హామీల వల వేసి.. ముంచేసి

నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Updated : 23 Apr 2024 06:56 IST

తీరంలో నిలిచిన హార్బరు, నల్లీక్రీక్‌ పనులు

మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వం

 

నరసాపురం(తూర్పుతాళ్లు), న్యూస్‌టుడే

  • నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్గో పోర్టు, హార్బర్‌ నిర్మిస్తాం. సముద్రంలో వేటాడిన చేపలు భద్రం చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజీలు నిర్మిస్తాం. ఎండ బెట్టుకొనేందుకు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తాం. నల్లీక్రీక్‌ అభివృద్ధి చేసి మత్స్యకారుల జీవన విధానం మెరుగు పరుస్తామంటూ..  సీఎం జగన్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు హామీల వర్షం కురిపించారు. అంతకు ముందు పాదయాత్ర సమయంలోనూ జగన్‌ ఇవే హామీలు గుప్పించారు. నేటికీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు.

కనీసం మత్స్యకార సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కడలి పుత్రులు ఆవేదన చెందుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తానని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. గతంలో రాయితీపై రుణాలు, వలలు, బోట్లు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఇవ్వలేదు. నేతలు హామీలు ఇవ్వంగా గాలిలో  కలిసిపోయాయి. అయిదేళ్ల పాలనలో   చూస్తే  మత్స్యకారుల బతుకులు మరింత దిగజారాయి.

  • ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే ముందు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు కార్గోపోర్టు నిర్మాణ పనులు ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నట్లు ప్రకటించి చినమైనవానిలంకలో మరోసారి భూమి పూజ చేశారు. ఈ పనులు ప్రారంభించలేదు.

చేపా చేపా.. ఎందుకు ఎండలేదంటే..

వాస్తవానికి బియ్యపుతిప్ప హార్బరు, నల్లీక్రీక్‌ పనులను తెదేపా హయాంలో ప్రారంభిస్తే వైకాపా వచ్చిన తర్వాత నిలుపుదల చేశారు. ప్రస్తుతం సముద్రంలో వేటాడిన మత్స్య సంపదను భద్రపరుచుకోవడానికి, ఆరబెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇసుకలో ఎండబెడుతుండటంతో నాణ్యత దెబ్బతిని గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. వలలకు చేపలు సమృద్ధిగా చిక్కినా.. మార్కెటింగ్‌ సౌకర్యం లేని దుస్థితి. స్థానికంగా విక్రయాలకు ఎలాంటి వసతులు లేవు. గతంలో చినమైనవానిలంకలో నిర్మించిన కోల్డ్‌ స్టోరేజీని వైకాపా ప్రభుత్వం విస్మరించింది. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం దూరం కావడంతో ఆర్థికభారం తప్పడం లేదు. దీంతో దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పథకాలు కొండెక్కాయి..

వైకాపా అయిదేళ్ల పాలనలో మత్స్యకారులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు కొండెక్కాయి. రాయితీపై వలలు, బోట్లు, వాహనాలు ఇవ్వలేదు. కార్గోపోర్టు నిర్మాణం పేరుతో హార్బరు నిలిపేశారు. ఈ ప్రభుత్వం 272 జీవో తీసుకొచ్చి మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. - వాతాడి ఉమామహేశ్వరరావు, వేములదీవిపడమర

మాటలతోనే సరి

తీరంలో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు చేపడతామని వైకాపా నాయకులు పలు సార్లు చెప్పారు. మా జీవితాలతో చెలగాటం ఆడారు. అయిదేళ్లలో మాటలతోనే సరిపెట్టారు. దీంతో తీరప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. - సంకరపు వెంకటేశ్వర్లు, పెదమైనవానిలంక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని