logo

సాయం ఎగనామం

తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు.

Updated : 23 Apr 2024 06:42 IST

కొర్రీలతో జగనన్న చేదోడు లబ్ధిదారుల కోత

చేతివృత్తిదారులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం

 నాడు

 తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. దీంతో బీసీ సామాజిక వర్గాల్లోని చేతివృత్తిదారుల్ని ఆర్థికంగా ప్రోత్సహించడంతో వారు తమ కాళ్లపై తాము నిలబడి తమ పిల్లలను బాగా చదివించుకున్నారు.

 నేడు
నా ఎస్సీలు, నా బీసీలు అనే జగన్‌..  వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చాక వారి పథకాలకే ఎసరు పెట్టారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా గడిచిన అయిదేళ్లలో ఎటువంటి రుణాలు ఇవ్వలేదు. బీసీలకు మంచి పథకాలు ఇస్తున్నానని గొప్పలు చెప్పడమే తప్ప.. ఆచరణ ఏ మాత్రం లేదు.. అందుకు నిదర్శనమే జగనన్న చేదోడు. చేతివృత్తిదారుల జీవనోపాధి మెరుగుకు ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి గొప్పగా చెప్పి జగన్‌ అనేక ఆంక్షలు విధించి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేసి వారిని మోసం చేశారు.

వీరవాసరం,ఏలూరు వన్‌టౌన్‌, ఉంగుటూరు, న్యూస్‌టుడే: దర్జీలకు, దుకాణాలు నిర్వహిస్తున్న నాయీబ్రాహ్మణులకు, రజక సామాజిక వర్గానికి చెందిన వారికి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అయిదు విడతల్లో రూ.50 వేల అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఈ సాయం ఎంతమందికి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2020లో పథకం ప్రవేశపెట్టినప్పుడు జిల్లా నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నుంచి ఈ పథకం వర్తింపజేశారు. మొదటి విడత 2021లో ఉమ్మడి జిల్లాలో  వేలల్లో దరఖాస్తు చేసుకుంటే వారిలో 20,714 మంది లబ్ధిపొందారు. రెండో విడతలో 18,445 మంది మాత్రమే లబ్ధి పొందారు.

విద్యుత్తు బిల్లు 300 యూనిట్లు దాటిందనో, వయస్సు దాటిపోయిందనో.. ధ్రువపత్రాలు సకాలంలో అందించలేదనో.. కుల ధ్రువ పత్రాలు లేవనో ఇలా అనేక కారణాలు చెప్పి 2,269 మందికి సాయం నిలిపివేశారు. నాలుగో విడతలో ఏలూరులో 16,486 మంది లబ్ధిదారులు ఉంటే అదే పశ్చిమగోదావరి జిల్లాలో 9,698 మందిని మాత్రమే ఎంపిక చేశారు.’

త రెండు విడతలతో  పోల్చుకుంటే ఈ నాలుగో ఏడాది   రెండు జిల్లాల పరిధిలో దాదాపు  6 వేల మందిని వివిధ కారణాలతో తొలగించారు. మొదటి సంవత్సరం ఎంపికైన వారు ఇక తమకు అయిదేళ్లపాటు సాయం అందుతుందని భావించారు. కానీ చాలా మందికి నిరాకరించారు.’

పథకంలో తమ పేర్లు ఎందుకు తొలగించారని సచివాలయ సిబ్బందిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. గత ఏడాది లబ్ధి పొందిన వారిలో మరుసటి ఏడాదిలో పేర్లు ఉండటం లేదు. ఇలా ఎంతో మంది లబ్ధిదారుల పేర్లను   జాబితా నుంచి వివిధ కొర్రీలు చూపించి తొలగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’

అంతా ప్రచారమే

2020, 2021 సంవత్సరాల్లో  రూ. 10 వేల చొప్పున   వచ్చింది.  2022లో  రాలేదు. గ్రామ వాలంటీరును సంప్రదిస్తే తమకు సంబంధంలలేదని.. డ్వాక్రా యానిమేటర్ల ద్వారా వస్తాయని చెప్పారు.  వైకాపా ప్రభుత్వం మాత్రం చేతివృత్తుల కార్మికులు, చిరు వ్యాపారులకు చేదోడు రుణాలు ఇస్తున్నామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటో ంది.
- సయ్యద్‌ మస్తాన్‌, వీరవాసరం

ఎందుకు తొలగించారో తెలియదు..

దర్జీ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. నా కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుమార్తెకు పెళ్లి చేశా. రెండో విడతలో దరఖాస్తు చేసుకుంటే మూడో విడతలో రూ.10 వేలు ఆర్థిక సహాయం పొందా. మరుసటి ఏడాది మాత్రం జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారో తెలియడం లేదు.

- అన్వర్‌, చేబ్రోలు

బీసీలకు తీరని అన్యాయం..

ఇలా చేస్తే బీసీలు, చేతివృత్తిదారులు ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతారు. గతంలో ఆదరణ ద్వారా అనేక పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవారు. వైకాపా వచ్చాక ఏదీ లేదు. రూ.10 వేలు ఇచ్చినట్లే ఇచ్చి వివిధ రూపాల్లో లాగేసుకుంటున్నారు. ఇప్పుడు పట్టణాల్లోని దుకాణాల్లో ఏసీలు, ఎలక్ట్రికల్‌ మిషన్లతోనే అంతా పనిచేసేది. మరీ 300 యూనిట్లు రాకుండా ఎలా ఉంటుంది. ఈ ప్రాతిపదికన తీసుకుంటే ఏ ఒక్కరికీ పథకం వర్తించదు. ఈ ప్రభుత్వంలో నాయీబ్రాహ్మణులకు ఏ న్యాయమూ జరగలేదు.
 తాటిపూడి చందు, నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని