logo

ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ఏరి?

గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే..

Published : 23 Apr 2024 06:15 IST

ఇంటి వద్దే వైద్యం.. అమలులో ఎంతో దూరం

చింతలపూడి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే..

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

 పైఅధికారుల సూచన మేరకు హడావుడి.. పల్లెల్లో వైద్య సేవలు మరింత బలోపేతం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటి వద్దకే వైద్యుల పేరిట గతేడాది ఏప్రిల్‌ 6న రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించింది. 104 వాహనాల ద్వారా ఇద్దరు వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు వెళ్లాలి. వైఎస్సార్‌ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు ఇద్దరు ఆశా వర్కర్లు, ఆ గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల దృష్టికి తేవాలి. అనంతరం శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికి వెళ్లి రోగులను పరీక్షించి వారికి నెలకు సరిపడా మందులు అందజేయాలి. కానీ ఎక్కడా ఈ విధంగా జరగడం లేదు.
జరుగుతోంది ఇదీ.. పీహెచ్‌సీల్లో ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఆస్పత్రిలో, మరొకరు క్షేత్ర స్థాయిలో 104 వాహనాలతో పాటు వెళ్లి ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 14 రకాల ర్యాపిడ్‌ పరీక్షలు చేసి ఆయా రోగాలకు వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇదంతా నామమాత్రంగా సాగుతోంది. రెండు నుంచి మూడు రకాల పరీక్షలు మాత్రమే చేసి జనరల్‌ సిరప్‌లు ఇచ్చి ముగిస్తున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం లేదు.  
యర్రంపల్లిలో డెంగీ లక్షణాలతో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు వైద్యారోగ్యశాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాక మొక్కుబడిగా మూడు రోజులు ఈ శిబిరాన్ని నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో ఇంటింటికీ తిరిగి దీర్ఘకాలిక రోగులను పరీక్షించిన దాఖలాలే లేవని గ్రామస్థులు చెబుతున్నారు.
చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.లావణ్య గత నెలలో డెంగీ లక్షణాలతో బాధ పడింది. తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది అనంతరం జ్వరం ఎక్కువై సరైన చికిత్స అందక చనిపోయింది. ఈ చిన్నారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ ఆమె ఇంటికి రాకపోవడం గమనార్హం.

వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా.. ‘మాది గణిజర్ల గ్రామం. డెంగీతో దాదాపు 10 రోజులు ఇబ్బంది పడ్డా. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద మూడు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ప్లేట్‌లేట్లు 70 వేలకు పడిపోయాయి. అనంతరం చింతలపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా మూడు రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. మా గ్రామంలో పది మంది వరకు డెంగీ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఏ వైద్య శిబిరం నిర్వహించలేదు’ అని గంధం మరియదాసు తెలిపారు.

మా ఇంటికి ఎవరూ రాలేదు.. ‘తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నా. నెలనెలా విజయవాడ ఆసుపత్రికి వెళతా. ఈ కార్యక్రమం గురించి ఎప్పుడూ వినలేదు. ఎవరూ మా ఇంటికి వచ్చి రోగం గురించి అడగలేదు. పరీక్షలు చేయలేదు. సలహాలు ఇవ్వలేదు.’ అని లింగపాలేనికి చెందిన ఏసు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని