logo

మూడేళ్లూ మందగమనమే

వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చేసింది. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలకూ సంకెళ్లు వేసింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాల్లోనే జడ్పీ, ఇతర స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.

Published : 28 Apr 2024 04:17 IST

 జడ్పీ పనుల్లో కనిపించని పురోగతి
నిధుల దుర్వినియోగంలో పోటాపోటీ

 ఏలూరు వన్‌టౌన్‌, వీరవాసరం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చేసింది. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలకూ సంకెళ్లు వేసింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాల్లోనే జడ్పీ, ఇతర స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు నుంచి గ్రామాలకు నిధుల కేటాయింపులో పారదర్శకత కొరవడిందని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన పనుల్లో సగం కూడా పూర్తికాలేదు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీరవాసరం మండలం మత్స్యపురి శివారు పిప్పళ్ళవారితోటలోని అంగన్‌వాడీ భవనం. 2018లో దీని నిర్మాణానికి నిధులు మంజూరు కాగా.. గుత్తేదారుడు పిల్లర్ల స్థాయి వరకు పనులు చేశారు. 2019లో ఎన్నికల తరువాత బిల్లులు అవ్వకపోవడంతో పనులు నిలిపివేశారు. దీన్ని పూర్తి చేసేందుకు ఇటీవల జిల్లా పరిషత్తు నిధులు రూ.10.80 లక్షలు విడుదల చేసినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు.

బిల్లులు అందక

జడ్పీ సాధారణ, ఆర్థిక సంఘ నిధులతో ప్రారంభించిన వాటిలో తాగునీటి బోర్లు, సీసీ రోడ్లు, కాలువలు, సామాజిక భవనాల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం, నాడు- నేడు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం తదితర పనులు చేపట్టారు. బిల్లులు జాప్యంతో వీటిలో చాలా వరకు పనులు అసంపూర్తిగానే వదిలేశారు. ఇవి పూర్తయినట్లు అధికారులు అంకెల్లో  ఘనంగా చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అంతంత మాత్రంగా జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో వీటిని చేయడానికి గుత్తేదారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

కేటాయింపుల తీరుపై అసంతృప్తి

జడ్పీ పాలకవర్గం ఏర్పడి దాదాపుగా మూడున్నరేళ్లవుతోంది. ఏడాదిన్నర వరకు డెల్టాకు చెందిన వ్యక్తి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జడ్పీ పాలన కంటే ఆయన సొంత నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాల్లో ఎక్కువగా తిరుగుతుండేవారు. ప్రతి జడ్పీటీసీ పరిధిలో అభివృద్ధి పనులకు పలు రకాల నిధుల నుంచి రూ.కోటి వరకు కేటాయించారు. వాటిని కొందరు సభ్యులకే ఎక్కువ ఇచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో జరిగిన సమావేశంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు గట్టిగా నిలదీశారు. అప్పట్లో పనులు జరగని వాటికీ బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ పాలనలో కూడా తాజాగా జరుగుతున్న పనుల్లో కూడా ఇదే తీరు అవలంబిస్తున్నారని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని