logo

దొరికినకాడికి దోచుకోవడమే!

ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు.

Published : 28 Apr 2024 04:29 IST

పురపాలికలో అవినీతి అనకొండ

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు. జిల్లాలోని ఓ మంత్రి సహకారంతో ఇతర విభాగం నుంచి డిప్యుటేషన్‌పై ఉన్నత స్థాయి అధికారిగా వచ్చిన ఆయన కొన్ని నెలలకే రూ.కోట్లకు పడగలెత్తారు. సొంత అవసరాలకు మున్సిపల్‌ సిబ్బందిని వినియోగించుకుంటూ విమర్శలపాలవుతున్నారు. ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగాల అధికారులను ఒత్తిడికి గురి చేస్తూ భారీ మొత్తంలో లబ్ధి పొందుతున్నట్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. సదరు అధికారి అవినీతి చిట్టా లెక్కించలేనంత స్థాయికి చేరుకోవడంతో పలువురు తెదేపా నేతలు సదరు అధికారిపై కలెక్టర్‌కు పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

వేలానికి ఉద్యోగాలు..

వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న ఆ మున్సిపాలిటీలో ఇటీవల అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేసే కంప్యూటర్‌ పోస్టు ఖాళీ అయ్యింది.  పోస్టు రూ.15 లక్షలకు విక్రయానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఆ అధికారికి వ్యతిరేకంగా పనిచేసే ఇరువురు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి ఒక్కొక్క పోస్టుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆప్కాస్‌ విధానంలో పనిచేసే ఇరువురు పారిశుద్ధ్య సిబ్బందిని వివిధ కారణాలు చూపించి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోస్టులను కూడా విక్రయానికి పెట్టడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెరపైకి టీడీఆర్‌ బాండ్లు..

ఇప్పటికే టీడీఆర్‌ బాండ్ల జారీలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఓ రహదారిని బృహత్తర ప్రణాళిక ప్రకారం 40 అడుగుల రోడ్డుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రోడ్డును వెడల్పు చేయాల్సిన అవసరమే లేదు. కానీ రోడ్డు వైండింగ్‌ పేరిట బాండ్లు జారీ చేసి పెద్ద మొత్తంలో లబ్ధిపొందాలని ఆ అధికారి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఖజానాకు కన్నం..   చిన్న చిన్న ఆక్రమణలు, రోడ్లపై ఉన్న మొక్కలను తొలగించడం వంటి  పనులకు రూ.లక్షల్లో బిల్లులు మంజూరు చేస్తూ మున్సిపల్‌ ఖజానాకు కన్నం వేస్తున్నారు. ఒకటి నుంచి ఆరు వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులకు ఏకంగా రూ.33.26 లక్షల బిల్లులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మిస్తుండగా ఆ అధికారి రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోవడంతో ఇంటిని కూల్చేందుకు పురపాలక అధికారులు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన పెద్ద దుమారమే లేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని