logo

పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు

వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Apr 2024 05:42 IST

భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పక్కన నాయకులు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ములకలచెరువు గ్రామీణ: వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శనివారం నిర్వహించిన ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలైన తెదేపా, భాజపా, జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో మరింత దోపీడీ సాగిందని, అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు.  పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీకే పాలు పోయాలని, పోయకుంటే కేసులు పెడతామని రైతుల్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు.  మామిడి కిలో ధర రూ.20 ఉండగా రూ.8కి అమ్ముకోవాల్సి వస్తోందంటూ ఇలా.. పాడి, మామిడి రైతుల ద్వారా ఏటా రూ.132 కోట్ల మేర దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పెద్ద ప్రాజెక్టుల పనులు రూ.2,145 కోట్లతో చేపట్టి రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా రూ.2 వేల కోట్ల దోపిడీకి పెద్దిరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి నియోజకవర్గంలో ప్రజల్ని బెదిరించి పేదల భూములు కబ్జా చేశారని, వీటన్నింటినీ తిరిగి పేదలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మంజూరు చేసిన నిధుల్ని.. వైకాపా ప్రభుత్వంలో పెద్దిరెడ్డి పుంగనూరుకు మళ్లించుకుపోయి పనుల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి మద్దతు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని