logo

ఎస్‌ఆర్‌బీసీ... తుంగలో తొక్కేసి..!

సీఎం జగన్‌ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి.

Published : 28 Apr 2024 05:47 IST

ప్రభుత్వం నిధులివ్వక నిలిచిపోయిన పనులు
40 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం

మైలవరం మండలం గంగులనారాయణపల్లె వద్ద నిలిచిన శ్రీశైలం కుడి కాలువ పనులు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు, పెద్దముడియం: సీఎం జగన్‌ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. శ్రీశైలం కుడిగట్టు కాలువ ద్వారా కృష్ణా జలాలను మైలవరం జలాశయంలోకి తీసుకురావాలన్న 16 ఏళ్ల కల కలగానే మిగిలిపోయింది. 141 నుంచి 199 కిలోమీటర్ల వరకు కాలువను నిర్మించి సుమారు 17,332 ఎకరాలకు నీరివ్వాలని రూపకల్పన చేశారు. మైలవరం జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించాలన్నది ప్రధాన లక్ష్యం. 2007, జనవరిలో 36, 37, 38వ ప్యాకేజీల్లో రూ.135.49 కోట్లతో గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. 2009, జనవరిలోపు పూర్తిచేయాల్సి ఉంది. రూ.75 కోట్ల మేర పనులు జరిగిన అనంతరం కొన్ని కారణాలతో కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాలువ పూర్తయితే నంద్యాల జిల్లా అవుకు నుంచి మైలవరం జలాశయానికి నేరుగా నీటిని తరలించవచ్చు. గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోట జలాశయంలోకి నీరు చేరితే అక్కడ్నుంచి మైలవరం జలాశయంలోకి నీటిని మళ్లించి నింపుతున్నారు. మూడు ప్యాకేజీల పనులు పూర్తయితే సుమారు 40 వేల ఎకరాలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది.

  • నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నేరుగా కృష్ణా జలాలలను తీసుకొచ్చేందుకు 2006లో నిర్ణయం తీసుకున్నారు. కాలువ పనుల కోసం సర్వే సైతం చేపట్టారు. అంతకు మునుపే అవుకు నుంచి పేరుసోముల వరకు కాలువను నిర్మించారు. అక్కడి నుంచి మైలవరం జలాశయం వరకు దాదాపు 54 కి.మీ. దూరం ఉంది. 2007, జనవరి 5వ తేదీన పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం పనులను రెండేళ్లలో అంటే 2009, జనవరి నాటికి పూర్తిచేయాల్సి ఉంది. పనులు చేపట్టి సుమారు 16 ఏళ్లు కావస్తున్నా కాలువ పనులు మొండికేశాయి. భూసేకరణలో జాప్యం, పెరిగిన ధరలు తదితర కారణాలతో శ్రీశైలం కుడికాలువ పనులకు మోక్షం కలగడంలేదు.

  • 36వ ప్యాకేజీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పెద్దముడియం మండలం కొండసుంకేసుల వరకు 12.77 కి.మీ. ప్రధాన కాలువ, 40 కి.మీ. మేర దాని ఉప కాలువ పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.38.72 కోట్లు కేటాయించగా, రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 12.7 కి.మీ. మట్టి కాలువ పనులు చేశారు. సిమెంటు పూత పనులు కేవలం 2 కి.మీ. చేయగలిగారు. ప్యాకేజీ కింద 13,500 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
  • 37వ ప్యాకేజీ కింద పెద్దముడియం మండలం దిగువ కల్వటాల నుంచి మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె వరకు 16.357 కిలోమీటర్ల ప్రధాన, 20.45 కి.మీ. ఉప కాలువలు నిర్మించాల్సి ఉంది. ఇంత వరకు భూసేకరణ జరగలేదు. రూ.48.40 కోట్లు కేటాయించగా రూ.27 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద 8,100 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
  • 38వ ప్యాకేజీ కింద మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె నుంచి మైలవరం జలాశయం వరకు 24.41 కి.మీ. ప్రధాన కాలువ, 15 కి.మీ. ఉపకాలువలు నిర్మించాల్సి ఉంది. భూసేకరణ జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి.  ఒప్పందం ప్రకారం 21 జనవరి, 2009 నాటికి గడువు పూర్తి కావడంతో మరో ఏడాదిపాటు పొడిగించారు. గుత్తేదారులు చేతులెత్తేయడంతో పనులు ఆగిపోయాయి. 2011, ఫిబ్రవరి 14న ఇంజినీర్ల బృందం మైలవరం మండలం బెస్తవేములలో భూసేకరణ సర్వేలు నిర్వహించినా పురోగతి లేదు.

రైతుల గోడు పట్టించుకునేదెవరు? : ఎస్‌ఆర్‌బీసీ కాలువ పనులు పూర్తయితే కొండసుంకేసుల, దిగువ కల్వటాల, పాపాయపల్లె గ్రామాల్లో వేలాది ఎకరాలకు నీరందుతుంది. ఎన్నో ఏళ్లుగా కాలువ పనులు ఆగిపోయాయి. ఇంతవరకూ పట్టించుకున్న వారే లేకపోవడం బాధాకరం.

మేడగం వెంకటరామిరెడ్డి, రైతు, కొండసుంకేసుల, పెద్దముడియం


రూ.230 కోట్లతో ప్రతిపాదనలు : గతేడాది జూన్‌లో 36, 37, 38 ప్యాకేజీలకు రూ.230 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. రిమార్కులున్నాయని జలవనరులశాఖ అధికారులు వెనక్కి పంపారు.ఆ మేరకు సవరణలు చేసి త్వరలో పంపిస్తాం.

సుబ్బరాయుడు, ఈఈ, ఎస్‌ఆర్‌బీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని