logo

Valentines day: ప్రేమ పునాదులపైభాగ్యసౌధం

ప్రేమికులను ఒకటి చేయడానికి రూపుదిద్దుకున్న వారధి పురానాపూల్‌.. ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకు వెలసిన నిర్మాణం హవామహల్‌.. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరంలో కొన్ని ప్రేమ గురుతులివి. మరణం లేని భావానికి మధుర జ్ఞాపకంగా నిలిచిన ‘భాగ్యనగరం

Updated : 14 Feb 2022 14:13 IST

కులీకుతుబ్‌షా, భాగమతి ప్రేమ చిహ్నం పురానాపూల్‌ వంతెన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రేమికులను ఒకటి చేయడానికి రూపుదిద్దుకున్న వారధి పురానాపూల్‌.. ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకు వెలసిన నిర్మాణం హవామహల్‌.. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరంలో కొన్ని ప్రేమ గురుతులివి. మరణం లేని భావానికి మధుర జ్ఞాపకంగా నిలిచిన ‘భాగ్యనగరం’ కులీ కుతుబ్‌ షా, భాగమతిల కలల సౌధం. ఇప్పటి మహానగరం పుట్టుక వెనుక ఒక ప్రేమ కథ దాగి ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆనాటి స్మృతులు ఒకసారి అవలోకనం చేస్తే మనం నిత్యం చూస్తున్న నగరమే మనకు కొత్తగా కనిపిస్తుంది.


ఖైరున్నీసా, కిర్క్‌ ప్యాట్రిక్‌


ప్యార్‌ కా పూల్‌ పురానాపూల్‌ వంతెన
క్రీ.శ. 1590కి పూర్వం కుతుబ్‌ షాహీల రాజధానిగా గోల్కొండ ఉండేది. అక్కడి నుంచి వారు పరిపాలన సాగిస్తున్న సమయంలోనే కులీ కుతుబ్‌ షా భాగమతిని ప్రేమించాడు. ఆమె చక్కటి నృత్యకారిణి. గోల్కొండకు 10 మైళ్ల దూరంలో ఉన్న చించల(నేటి శాలిబండ) అనే చిన్న గ్రామంలో భాగమతి ఉండేది. ఆమెను కలుసుకోవడానికి కులీ కుతుబ్‌షా రోజు ముచుకుందా(మూసీ)నది దాటి వెళ్లేవాడట. ఒకరోజు భాగమతిని కలవడానికి ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న నదిని దాటాడు. ఆ సంగతి తెలిసిన తండ్రి కలత చెందాడు. వెంటనే పురానాపూల్‌ వంతెన నిర్మాణానికి ఆదేశించాడట. దీని నిర్మాణం 1578లో జరిగింది. ఈ వారధి ప్రేమకు బాటలు వేసినందువల్ల చాలామంది దీన్ని ‘ప్యార్‌ కా పూల్‌’ అని కూడా పిలుస్తుంటారు. గోల్కొండ రాజధానిగా ఉన్న సమయంలోనే తరచూ వస్తున్న నీటి సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో రాజధాని నగరాన్ని మార్చాలని కుతుబ్‌షాహీ వంశస్తులు ఆలోచించారంటారు. అందులో భాగంగానే మూసీ ఒడ్డున నగరాన్ని అభివృద్ధి చేయాలని, తద్వారా నీటి సమస్య తీరుతుందన్నది వారి ఆలోచన. దీనికోసం సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్న సమయంలోనే యువరాజు అయిన కులీకుతుబ్‌షా నది దాటి ఈ ప్రాంతానికి రావడం అక్కడ కుగ్రామంలో భాగమతిని చూశారని చరిత్రకారులు చెబుతుంటారు. అలా నగర నిర్మాణ అన్వేషణలో భాగంగా భాగమతి ప్రేమలో పడిన రాజకుమారుడు అక్కడే నగరాన్ని నిర్మించారన్నది మరో కథనం.
కానుకగా భవనం..
ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం లేదని 1803లో బ్రిటిష్‌ రెసిడెన్సీ కిర్క్‌ప్యాట్రిక్‌, ఖైరున్నీసాలు నిరూపించారు. బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో కిర్క్‌ప్యాట్రిక్‌ అనే అధికారి ప్రస్తుత కోఠిలోని మహిళా కళాశాలలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీ (దర్బార్‌హాల్‌) కేంద్రంగా పరిపాలన నిర్వహించేవాడు. 1798 నుంచి 1805 వరకు హైదరాబాద్‌ 6వ రెసిడెన్సీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో సుల్తాన్‌ బజార్‌ మార్కెట్‌ వీధుల్లో వెళ్తుండగా ఖైరున్నీసాబేగంను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకుని హస్మత్‌గంజ్‌ బహద్దూర్‌గా పేరు మార్చుకున్నాడు. వారి ప్రేమకు సాక్షిగా కోఠి మహిళా కళాశాలలో ఆమెకు హవామహల్‌ను కట్టించి కానుకగా ఇచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని