logo

అటకెక్కిన నిబంధనలు.. అధికంగా వసూళ్లు!

ఇలా చాలా వరకు కేంద్రాల్లో ప్రతి దరఖాస్తు వెంట ఎక్కువ మొత్తంలో దోచుకోవడం సాధారణమైపోయింది. రవాణా కార్యాలయంలో పొందే అన్ని రకాల సేవలకు సంబంధించి వీటిల్లో అదనంగా వసూలు

Published : 21 Jan 2022 01:05 IST

మీ-సేవా కేంద్రాల్లో నిర్వాహకుల ఇష్టారాజ్యం

న్యూస్‌టుడే, వికారాబాద్‌

* వికారాబాద్‌ మండలం పుల్‌మద్దికి చెందిన ఓ రైతు బ్యాంకు రుణం కోసం అవసరమైన భూమి తాలూకూ సర్టిఫైడ్‌ పత్రాలకు మీ సేవలో నిర్ణీత రుసుం రూ.535 చెల్లించి ఉదయం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం తరువాత తీసుకెళ్లాలని చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. అదనంగా మరో రూ.వంద తీసుకుని పత్రాలు ఇచ్చారు.

* ఇటీవల ధారూర్‌కు చెందిన ఓ యువకుడు విద్యుత్తు మీటరు మార్పునకు వికారాబాద్‌లోని మీ- సేవ కేంద్రంలో అర్జీ సమర్పించారు. నిర్ణీత రుసుం రూ.170 చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.50 కలిపి రూ.220 వసూలు చేశారు. అదేమని ప్రశ్నిస్తే అందరికీ ఇలాగే తీసుకుంటున్నామని బదులిచ్చారు.

ఇలా చాలా వరకు కేంద్రాల్లో ప్రతి దరఖాస్తు వెంట ఎక్కువ మొత్తంలో దోచుకోవడం సాధారణమైపోయింది. రవాణా కార్యాలయంలో పొందే అన్ని రకాల సేవలకు సంబంధించి వీటిల్లో అదనంగా వసూలు చేస్తున్నారు. సిటిజన్‌ ఛార్ట్‌ ప్రకారం ప్రతి సేవకు రుసుం ఉంటుంది. ఆ ప్రకారమే తీసుకోవాల్సి ఉండగా, అధికంగా రూ.20 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అడిగేవారు లేరని ఇదే అదునుగా నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 74 మీ- సేవ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రతిరోజు 5 వేల నుంచి 6 వేల మంది వరకు అన్ని రకాలకు సంబంధించిన అర్జీలు సమర్పిస్తారు. అధికంగా ఆదాయం, కులం, జనన, మరణ, పహాణీ తదితర ధ్రువపత్రాలతో పాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపునకు సంబంధించి కార్యకలాపాలు జరుగుతుంటాయి. అయితే ప్రతి పనికి సంబంధించిన నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయవద్ధు అయితే కొందరు నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు ఆధార్‌కు రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. నిర్వాహకులు మాత్రం రూ.50 నుంచి రూ.100 వరకు తీసుకుంటున్నారు. ఇలా కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాలన్నింటికీ అధికంగా వసూలు చేస్తున్నారు.

పట్టణాల్లోనే..: ఎక్కడో మారుమూల ప్రాంతంలో అధికంగా వసూళ్లకు పాల్పడటం కాదు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ వంటి పట్టణాల్లో నిర్వాహకులు ఇష్టానుసారం తీసుకుంటున్నారు. అధికంగా తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారులకు తెలియదు. అందుకే ప్రతి కేంద్రంలో ఏ సేవకు ఎంతెంత రుసుం చెల్లించాలన్నది పేర్కొంటూ పట్టికను అందరికీ కనిపించేటట్లుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అధికారి చిరునామాతో కూడిన చరవాణి సంఖ్యను కూడా పట్టికలో పొందుపరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫిర్యాదు చేయండిలా..

* మీ- సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్ఛు తాము పొందిన సేవకు సంబంధించిన ఫారంతో పాటు పూర్తి వివరాలు జతచేస్తే చర్యలు తీసుకుంటారు.

* మండల స్థాయిలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్ఛు పక్కా ఆధారాలు సమర్పిస్తే సంబంధిత కేంద్రంపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

* మీ- సేవ అంతర్జాల వెబ్‌సైట్‌లోనూ నేరుగా చేయవచ్ఛు గూగుల్‌లో మీ- సేవ తెలంగాణ అని టైప్‌ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల సెల్‌లో నమోదు చేసినా సరిపోతుంది.

* ఇలా వీలుకాని పక్షంలో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు ఉంది. పరిష్కారం కాల్‌సెంటర్‌ సంఖ్య 18004251110కు ఫిర్యాదు చేస్తే వారు సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం చేరవేస్తారు.

పరిశీలించి చర్యలు..

అధికారికంగా నిర్దేశించిన సిటిజన్‌ ఛార్ట్‌ ప్రకారం ప్రతి సేవకు నిర్ణీత రుసుం మాత్రమే తీసుకోవాలి. దీనికి మించి వసూలు చేస్తే సంబంధిత కేంద్రంపై చర్యలు తీసుకుంటాం. మండల కేంద్రాలకు సంబంధించినవారు ఆయా తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో రుసుం వివరాలను తెలియపర్చే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం.

- మోతీలాల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌, వికారాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని