వికసిత భారతం... సుదూర స్వప్నం!

పరపీడన నుంచి స్వేచ్ఛ సాధించడంతో భారత స్వాతంత్య్రోద్యమం ముగిసిపోలేదు. వాస్తవానికి దాని లక్ష్యం అదొక్కటే కాదు. ప్రజలు ఉన్నత స్థితికి ఎదిగేలా చేయడం... తద్వారా మానవత్వాన్ని పెంపొందించడమే నాటి ఉదాత్త పోరాట అంతిమ ఆశయంగా పండిత నెహ్రూ అభివర్ణించారు. ఆ సామాజిక పరివర్తన సత్వరం సాధ్యం

Updated : 16 Aug 2022 06:03 IST

రపీడన నుంచి స్వేచ్ఛ సాధించడంతో భారత స్వాతంత్య్రోద్యమం ముగిసిపోలేదు. వాస్తవానికి దాని లక్ష్యం అదొక్కటే కాదు. ప్రజలు ఉన్నత స్థితికి ఎదిగేలా చేయడం... తద్వారా మానవత్వాన్ని పెంపొందించడమే నాటి ఉదాత్త పోరాట అంతిమ ఆశయంగా పండిత నెహ్రూ అభివర్ణించారు. ఆ సామాజిక పరివర్తన సత్వరం సాధ్యం కాకపోతే- ‘కాగితం మీద మనం రాసుకున్న రాజ్యాంగ సూత్రాలన్నీ పనికిరానివి, అర్థంలేనివీ అవుతాయి’ అని ఆయన హెచ్చరించారు. వరసగా తొమ్మిదోసారి నిన్న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ- స్వాతంత్య్ర సమరయోధుల కలలను 2047కల్లా సాకారం చేసే మహత్తర బాధ్యతను అందరూ స్వీకరించాలని పిలుపిచ్చారు. దీర్ఘకాల స్వప్నాలను నిజం చేసుకునేందుకు- వికసిత (అభివృద్ధి చెందిన) భారతాన్ని ఆవిష్కరించుకోవడం, తెల్లదొరల కాలపు బానిస ఆలోచనలను వదిలించుకోవడం, మన మూలాలకు గర్వించడం, ఐకమత్యంతో ముందుకు సాగడం, పౌరవిధులను పాటించడమనే పంచ మార్గాలను ఆయన ప్రతిపాదించారు. ఇండియాతో పోలిస్తే 75 ఏళ్ల క్రితం ఇండొనేసియా అన్నిట్లోనూ వెలాతెలా పోతుండేది. 1970లలో అక్కడి మూడొంతుల జనాభా పేదరికం పడగనీడలో అల్లాడేది. అటువంటి వారి సంఖ్య నిరుడు అక్కడ 10.1శాతానికి పరిమితమైంది. గతేడాది వెలువడ్డ నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం- భారత ప్రజల్లో పాతిక శాతం బహుముఖ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. బిహార్‌ (51.91 శాతం), ఝార్ఖండ్‌(42.16), ఉత్తర్‌ ప్రదేశ్‌(37.79), మధ్యప్రదేశ్‌(36.65) రాష్ట్రాల్లోనైతే జాతీయ సగటుకు మించిన బీదలు- వెనకబడిన భారతానికి ప్రతినిధులుగా దుర్భర జీవితాలు నెట్టుకొస్తున్నారు. బ్రిక్స్‌, జీ7, దక్షిణాసియా దేశాలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన రాజ్యాలను కలిపి మొత్తం ఇరవై ఆరింట్లో 2020 నాటికి తలసరి స్థూల జాతీయోత్పత్తి పరంగా ఇండియా 24వ స్థానంలో నిలిచింది. 1960 తరవాత ఆరు దశాబ్దాల్లో ఆ జాబితాలో భారతదేశం ర్యాంకు ఏమాత్రం మారలేదు! అప్పట్లో అందులో దిగువన పడి ఉన్న ఇండొనేసియా- రెండేళ్ల క్రితం మనల్ని అధిగమించింది. 1950-2019 మధ్యకాలంలో మానవాభివృద్ధి సూచీలోనూ ఇండొనేసియా, సౌదీ అరేబియా వంటివి మనల్ని మించిపోయాయి. పేరుగొప్ప ప్రగతి ప్రణాళికల అమలులో పోగుపడ్డ లెక్కకుమిక్కిలి లోపాలే దేశానికి పెనుశాపాలవుతున్నాయి!  

విస్తరిస్తున్న అంకుర పరిశ్రమలు యువతకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తంచేశారు. కొన్నేళ్లుగా దేశీయంగా స్టార్టప్‌ సంస్కృతి ఊపందుకొంది. సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా ఎక్కువగా స్వీయ ప్రతిభా సంపన్నతతోనే నవతరం- పోటీ ప్రపంచంలో మిన్నగా రాణిస్తోంది. వ్యవస్థాగతమైన మద్దతు సమధికంగా తోడైతే అది మరిన్ని విజయాలను నమోదుచేస్తుంది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్య నేతిబీర చందమవుతుండటంతో- యువతరంలో అధిక శాతం ఉపాధి వేటలో కళ్లు తేలేస్తోంది. కాగితాలపై కాంతులీనుతున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాల స్ఫూర్తి క్షేత్రస్థాయికి విస్తరిస్తేనే- తమ కాళ్లపై తాము నిలబడగలిగే శక్తి భారతీయ యువతకు అందివస్తుంది. మరోవైపు, 2011-12లో 2.2శాతంగా ఉన్న వార్షిక నిరుద్యోగిత రేటు ఆ తరవాత ఆరేళ్లలోనే సుమారు మూడు రెట్లు ఎగబాకి, గడచిన నాలుగు దశాబ్దాల్లో గరిష్ఠ స్థాయి 6.1 శాతానికి చేరుకుంది. నిరుడు డిసెంబరు నాటికి స్థూల వార్షిక నిరుద్యోగిత 7.9 శాతమైంది. ఉపాధి కల్పనా పథకాల్లో డొల్లతనానికి సాక్షీభూతంగా నిరుద్యోగుల పాట్లు ఏటా విస్తరిస్తున్నాయి. దేశీయంగా దిగువన ఉన్న యాభై శాతం జనాభాతో పోలిస్తే పై అంచున నిలబడుతున్న పదిశాతం సంపాదన 96 రెట్లు అధికంగా ఉన్నట్లు చాటుతున్న ప్రపంచ ఆదాయ అసమానతల నివేదిక-2022 అధ్యయనాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నికార్సైన వైద్యసేవల అందుబాటులో పల్లె- పట్టణం, ఆపన్నులు- సంపన్నుల నడుమ పొడచూపుతున్న అంతరాలు... ప్రజల సగటు ఆయుర్దాయాల్లో వ్యత్యాసాలకు కారణమవుతూ, సమానత్వ భావనకు సమాధి కడుతున్నాయి. కొన్నేళ్లుగా పథకాలెన్నో పట్టాలకెక్కినా- అందరికీ ఇళ్లు అందని ద్రాక్షలవుతున్నాయి. భారత దేశానికి సేవ చేయడాన్ని- దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాల్లో అసమానతలను నిర్మూలించడంగా ప్రథమ ప్రధాని నిర్వచించారు. కాలగతిలో కరిగిపోయిన ఏడున్నర దశాబ్దాల్లో అటువంటి ‘సేవ’కు నేతాగణం ఎంత త్రికరణ శుద్ధితో నిబద్ధమైందో- సరైన పోషణ లేక ఆసేతుహిమాచలం వసివాడుతున్న బాల్యం, జీవన ప్రమాణాల్లో ఈసురోమంటున్న జనావళి దైన్యమే కళ్లకు కడుతోంది. స్వాతంత్య్ర శత వసంతోత్సవాల నాటికైనా శ్రేష్ఠ భారతం ఆవిష్కృతం కావాలంటే- సంక్షేమ రాజ్యభావనకు నిజంగా పట్టంకడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి!

సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ చైతన్యాల మేళవింపుతో ఇండియాను లౌకిక ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దాలన్నది రాజ్యాంగ నిర్మాతల అకాంక్ష. మనతోపాటే కళ్లు తెరిచిన పాకిస్థాన్‌- మత ఛాందసత్వంలో కూరుకుపోయి నేడు ఒక విఫల రాజ్యంగా మిగిలిపోయింది. ఉదారవాద విలువలను ఇన్నేళ్లుగా నిలబెట్టుకుంటూ వచ్చిన భారత్‌- ప్రధాని ఉద్ఘాటించినట్లు తన ప్రజాతంత్ర శక్తిని అందరికీ చాటిచెప్పింది. కానీ, భిన్నత్వాన్ని సహించలేని అరాచక మూకల వీరంగాలు- జనస్వామ్యానికి ప్రాణప్రదమైన భావప్రకటనా స్వేచ్ఛకు నేడు సంకెళ్లు వేస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని చీకటి నిబంధనల మాటున అమాయకుల జీవితాలు కడతేరి పోతున్నాయి. ఆంగ్లేయుల కర్కశత్వానికి ప్రతిరూపంగా పురుడుపోసుకున్న  పోలీసు దళాలు- నేటికీ అదే స్థాయిలో ఠాణాల్లో మానవ హక్కులను కబళిస్తున్నాయి. వ్యవస్థల స్వతంత్రతపై పరచుకుంటున్న నీలినీడలు- సంవిధాన ప్రమాణాలను పెళుసుబారుస్తున్నాయి. బడితె ఉన్నవాడిదే బర్రె అన్నట్లు... డబ్బు కలిగిన వాళ్లదే రాజ్యంగా రాజకీయాలు అఘోరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సరైన ప్రతిపక్షాలే కొరవడిన దురవస్థ- దేశీయంగా భారీ గతుకుల బాటలో సాగుతున్న ప్రజాస్వామ్య రథానికి అద్దంపడుతోంది. సహకార సమాఖ్య వ్యవస్థను బీటలు వార్చేలా కేంద్రం ఏకపక్షంగా వ్యహరిస్తోందంటూ రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ ప్రత్యేకత... దేనినైనా పరస్పర అవగాహనతో, ఆమోదంతో సాధించాల్సి ఉంటుంది’- హిందీని జాతీయ భాషగా గుర్తించడంపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వ్యక్తంచేసిన అమూల్య అభిప్రాయమిది. సమకాలీన నాయకుల్లో ఆ సహిష్ణుత లోపించడమే ప్రజాస్వామ్య భారతం ప్రారబ్ధం!

అమర వీరుల త్యాగఫలాన్ని గుల్లబారుస్తున్న కులమత తత్వాలు, అవినీతి, హింసలపై స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సమయంలో రాష్ట్రపతిగా కె.ఆర్‌.నారాయణన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.  అమృత మహోత్సవాల నాటికి ఆ జాడ్యాలు మరింతగా కోరచాస్తున్నాయి. ముఖ్యంగా వటవృక్షంగా విస్తరించిన అవినీతి- సామాజిక ప్రగతికి వేరుపురుగు అవుతోంది. ఆ చీడ అంతం కావాలంటే- అవినీతిపరులను ప్రజలు ఏవగించుకోవాలని, భ్రష్టాచారాలపై సరైన ఎరుకతో వ్యవహరించాలన్న ప్రధాని వ్యాఖ్యలు అక్షరసత్యాలు. అక్రమాలకు లాకులెత్తిన ప్రబుద్ధులే నాయకులవుతున్న అవ్యవస్థను తుడిచిపెట్టినప్పుడే- అవినీతి వ్యతిరేక పోరాటం సఫలమవుతుంది. ‘పుట్టుక, కులం, మతం, సంప్రదాయాలపై ఆధారపడిన మధ్యయుగాల పద్ధతి నుంచి భారత దేశాన్ని బయటికి తెచ్చి... చట్టం, వ్యక్తిగత ప్రతిభ, లౌకిక విద్య అనే ఆధునిక పునాదుల మీద సామాజిక వ్యవస్థను పునర్నిర్మించే; ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శాస్త్రీయ, ప్రణాళికాబద్ధ వ్యవసాయ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే’ సామాజిక విప్లవాలకు ప్రభుత్వాలు సారథ్యం వహించాలని రాజ్యాంగ సభ సభ్యులు కె.సంతానం అభిలషించారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ఆ బాధ్యతను ఔదలదాలిస్తేనే- దేశం తలరాత మారుతుంది. విధాన రచనకు సమ్మిళిత అభివృద్ధి ప్రధాన కేంద్రమైతేనే- వికసిత భారతం వాస్తవ రూపం దాలుస్తుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.