చలి మరి.. జాగ్రత్త కోరి..!!

చలికాలం వచ్చేసింది. చర్మంపై ఇతర కాలాల కంటే ఇప్పుడు మరింత శ్రద్ధ అవసరం. చల్లని, పొడి గాలితో తేమ తగ్గడం వల్ల చర్మం చిరాకుగా అనిపిస్తుంది.

Updated : 26 Nov 2020 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  చలికాలం వచ్చేసింది. చర్మంపై ఇతర కాలాల కంటే ఇప్పుడు మరింత శ్రద్ధ అవసరం. చల్లని, పొడి గాలితో తేమ తగ్గడం వల్ల చర్మం చిరాకుగా అనిపిస్తుంది. మరి చర్మంపై ఏర్పడే సహజ తేమను నిలుపుకోవాలంటే.. చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఎక్కువ సమయం వద్దు
ఈ కాలంలో సాధారణం కంటే ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయాలనిపిస్తుంది. కానీ అధిక సమయం వేడి నీటి స్నానం చర్మానికి మంచిది కాదు. దీంతో చర్మం పొడిబారిపోతుంది. దానిపై దద్దుర్లు ఏర్పడొచ్చు. మీ ముఖాన్ని, చేతులనూ ఎక్కువ వేడిగల నీటితో శుభ్రం చేయొద్దు. వీలైనంత వరకూ గోరువెచ్చని లేదా చల్లని నీటితోనే కడిగే ప్రయత్నం చేయండి. ఇది సూక్ష్మక్రిములను త్వరగా సంహరిస్తుంది. 

లోషన్లు వాడచ్చు
శీతాకాలంలో చర్మంపై సహజ తేమ ఎక్కువ సమయం నిలవదు. చర్మం త్వరగా పొడిబారిపోతుంది. అందుకే స్నానం చేసిన తర్వాత చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. దానికి లోషన్లు వాడొచ్చు. ముఖానికి క్రీమ్‌ లేదా లేపనాలను ఉపయోగించొచ్చు. చేతులు, కాళ్లను శుభ్రపరుచుకున్న తరువాత క్రీమ్‌ రాయడం ద్వారా తేమతో మృదువైన చర్మం మీదవుతుంది. ఇక ముఖ్యంగా పెదాలకు లిప్‌బామ్‌ రాయడం ద్వారా పగలవు.

తక్కువగా వాడండి
చర్మాన్ని సంరక్షించుకోవడంలో మనం వాడే సబ్బూ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మనం ఎక్కువగా ఉపయోగించే బార్‌ సబ్బులలో చిరాకు కలిగించే పదార్థాలు, సుగంధాలు కలిగి ఉంటాయి. దీంతో చర్మం పొడిబారి దురద రావచ్చు. దీనికి బదులుగా సువాసన లేని జెల్‌తో ముఖాన్ని కడగడం మంచిది. ఈ కాలంలో వీలైనంత వరకూ సబ్బును తక్కువగా ఉపయోగించుకోవడమే ఉత్తమం.

సన్‌స్క్రీన్‌లు వాడండి
ఎక్కువ వెలుతురు ఉన్న రోజుల్లో మంచు సూర్యకిరణాలను ప్రతిబింబిస్తుంది. అందుకే మీరు మంచులో ఆడినా, ఉద్యానవనానికి వెళ్లినా వేసవిలో వాడినట్టుగా ఈ కాలంలోనూ సన్‌స్క్రీన్‌లు తప్పక వినియోగించాలి. దీంతో సూర్యుని ద్వారా వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

మంచి ఆహారం, నీరు 
మీ చర్మం ఎక్కువగా పొడిబారితున్నట్లయితే ఒమేగా-3 లేదా ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోండి. చేప నూనెలో ఈ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. అంతేకాదు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రయత్నించండి. ఇక చలికాలంలో ఎక్కువ దాహంగా అనిపించదు. కానీ ఏ కాలంలో అయినా శరీరానికి అవసరమైన నీటిని తప్పక తీసుకోవాలి. దీంతో డీ-హైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది.  

దుస్తులు ముఖ్యమే
చలికాలంలో మనం ఎంచుకునే దుస్తులూ ముఖ్యమే. ఉన్ని వంటి కఠినమైన దుస్తులు మీ చర్మానికి నేరుగా తాకకుండా జాగ్రత్త పడండి. దీంతో పొడిచర్మం, చిరాకు, దురద కలగొచ్చు. దీనికి బదులుగా సింపుల్‌, సౌకర్యవంతమైన టీ షర్ట్ లేదా షర్ట్‌‌లను ధరించి వాటిపై స్వెటర్‌ లేదా జర్కిన్లను ప్రయత్నించొచ్చు. కాటన్‌ లేదా సిల్క్‌తో తయారు చేసిన చేతి తొడుగులను వాడండి. వీలైనంత వరకూ దుస్తులు పూర్తిగా ఎండిన తర్వాతే ధరించే ప్రయత్నం చేయండి. తడి దుస్తులు, బూట్లు మీ చర్మానికి చిరాకు తెప్పిస్తాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని