
AP PRC: మంత్రుల కమిటీతో చర్చలకు రండి.. ఉద్యోగ సంఘాలకు మరోసారి ఆహ్వానం
అమరావతి: పీఆర్సీ అంశంపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం పంపారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖ కాన్ఫరెన్స్ హాలులో 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా స్టీరింగ్ కమిటీకి పిలుపునిచ్చారు.
వేతన సవరణతో పాటు మరో ఐదు అంశాలపై పీఆర్సీ సాధన సమితి జీఏడీ ముఖ్యకార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై అధికారికంగా సీఎస్ సమీర్‌శర్మ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రుల బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా.. సీఎస్ సమీర్ శర్మ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆహ్వానించారు.