AP Inter: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంత మంది ఉత్తీర్ణులయ్యారో తెలుసా..?

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 39.6శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరి బాబు ఈ ఫలితాలను విడుదల చేశారు. 

Updated : 13 Jun 2023 22:59 IST

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ(AP Inter Advanced Supplementary Exams results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు (AP Inter board) కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 39.6శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత మార్చిలో అనుత్తీర్ణులైన వారిలో 2,51,653 మంది పరీక్ష రాయగా 99,698 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 37.77శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ద్వితీయ సంవత్సరంలో 42.36శాతం మంది పాస్‌ అయ్యారు. మొదటి ఏడాది మార్కుల మెరుగుకు 1,69,347 పరీక్షలు రాయగా.. ఇందులో 1,41,733 మందికి మార్కులు పెరిగాయి. గతంలో అనుత్తీర్ణులై ఇప్పుడు రెండో ఏడాది పరీక్ష రాసిన వారిలో 37.22శాతం మంది పాస్‌ అయ్యారు. గత మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి మొదటి ఏడాదిలో బాలురు 74.34శాతం, బాలికలు 80.56శాతం, రెండో ఏడాదిలో బాలురు 81.99శాతం, బాలికలు 86.46శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు.

పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..

మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. వైయస్‌ఆర్‌ జిల్లా అట్టడుగున నిలిచిందన్నారు. రెండో ఏడాదిలో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, వైయస్‌ఆర్‌ చివరి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్‌ ఒకటి వరకు నిర్వహించగా.. కేవలం 12 రోజుల్లోనే ఫలితాలు ఇచ్చామని తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్, స్కానింగ్‌ కాపీతోపాటు రీవెరిఫికేషన్‌కు ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇక మార్చితోపాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సీఎం సొంత జిల్లా వైఎస్సార్‌ జిల్లా 63.32% ఫలితాలతో అట్టడుగున ఉంది. రెండో ఏడాదిలోనూ 75.95%తో చివరి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా  విజయనగరం మొదటి ఏడాదిలో 66.57శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 80.76శాతంతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని