Viral: కంగ్రాట్స్‌! మీరు మా ఇంట్లో ఉండేందుకు సెలక్ట్‌ అయ్యారు!

బెంగళూరులో ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది. అద్దెంటి కోసం ఓ యజమాని వాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. తర్వాత షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరల్‌గా మారింది.

Published : 04 Nov 2023 17:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: నగరాల్లో కొత్తవారికి ఇల్లు అద్దెకివ్వడం అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందుకే ఇంటి యజమానులు.. అద్దె కోసం వచ్చే వారి కుటుంబ స్థితి, ఉద్యోగ వివరాలు వంటివి ఆరా తీస్తారు. గుర్తింపు కార్డు జిరాక్సులు కూడా అడిగి తీసుకుంటారు. అదే బెంగళూరు లాంటి నగరాల్లో ఐతే ఈ ప్రక్రియ మరింత క్లిష్టతరం. ఈ మహా నగరంలో ఇంటిని అద్దెకు తీసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చాలా మంది సోషల్‌మీడియా వేదికగా నిత్యం గోడు వెళ్లబోసుకుంటూ ఉంటారు. ఇదీ అలాంటి ఘటనే. ఇంటి అద్దె కోసం వెళ్లిన ఓ జంటకు యజమాని నుంచి వచ్చిన ఆఫర్‌ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెంగళూరులో అద్దెంటి కోసం అన్వేషిస్తున్న ఓ జంట ఇటీవల ఓ ఇంటిని సందర్శించింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని నుంచి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని ఇషు అనే ఎక్స్‌ యూజర్‌ యథాతథంగా పోస్ట్‌ చేశారు. అందులో సదరు ఇంటి ఓనర్‌ ఏం రాశాడంటే...? ‘‘హాయ్‌! ఆ రోజు మీ ఇద్దరినీ కలిసినందుకు ఆనందంగా ఉంది. మా ప్రాపర్టీ చూసిన వాళ్లను వ్యక్తిగతంగా కలుస్తున్నానని మీకు ఆ రోజే చెప్పాను. ఇప్పటి వరకు ఇల్లు అద్దెకు కావాలని చాలా మంది ఆసక్తి చూపినా అందరినీ కలవలేదు. నన్ను కలిసిన వాళ్లలో కొందరిపై మంచి అభిప్రాయం, ఇంటిని చక్కగా నిర్వహించగలరన్న నమ్మకం ఏర్పడింది. అందులోంచి షార్ట్‌ లిస్ట్ చేశాను. అందులో మీకు ఫస్ట్‌ ఆఫర్‌ ఇస్తున్నా’’ అని ఆ జంటకు సందేశం పంపారు.

నాకు పెళ్లి చేస్తేనే.. ఎన్నికల విధులకు వస్తా!

దీన్ని ఇషా తన ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంటర్వ్యూ తర్వాత మా ఓనర్‌ మమ్మల్ని ఎంపిక చేశారు’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఈ తరహా ఎంపికను తాను ఊహించలేదని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు. ‘ఇదేదో జాబ్ ఆఫర్‌లా ఉందే’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా.. ‘హెచ్‌ఆర్‌ రౌండ్‌ అయిపోయింది.. ఇక టెక్నికల్‌ రౌండా?’ అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. ‘ఇక ఆ యజమానిని మీరు ఇంటర్వ్యూ చేయండి’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని