అభయారణ్యంలో అక్రమ సాగు

అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అభయారణ్యం పరిధిలో చెరువులు తవ్వి చేపలు సాగుచేస్తున్నారు.

Updated : 30 Jan 2023 06:10 IST

సహజ స్వరూపం కోల్పోతున్న కొల్లేరు

మొండికోడు పరిధిలో వరి సాగు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అభయారణ్యం పరిధిలో చెరువులు తవ్వి చేపలు సాగుచేస్తున్నారు. దీనికిప్పుడు వరి సాగు తోడైంది. చేపలు, రొయ్యల చెరువులు, వరి సాగుతో కొల్లేరు సహజ స్వరూపం మారిపోతోంది. బడా బాబులు, అధికార పార్టీల నాయకుల అండదండలతో అక్రమ సాగు కొనసాగుతోందని ఫిర్యాదులు అందుతున్నా అధికార యంత్రాంగంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది.  

ఏలూరు మండలం మొండికోడు పరిధిలోని కొల్లేరు అభయారణ్యంలో సుమారు 200 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. వానాకాలంలో కొల్లేరు సరస్సు నీటితో నిండుగా ఉంటుంది. శీతాకాలంలో నీరు తగ్గిన తర్వాత దమ్ము చేసి వరి నాట్లు వేసి సాగు చేస్తున్నారు. నాట్లు మునిగిపోకుండా చుట్టూ ఎత్తుగా గట్లు వేస్తున్నారు. వరి పైరు ఎదుగుదల, దిగుబడులకు రసాయనిక ఎరువులు, చీడపీడలు, తెగుళ్ల నివారణకు పురుగుమందుల వినియోగంతో కొల్లేరు సరస్సులోని నీరు కలుషితమై చిత్తడి నేలల స్వభావం దెబ్బతింటోంది. సహజసిద్ధంగా పెరిగే మత్స్య సంపద కనుమరుగవుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వలస పక్షుల రాక రాన్రాను తగ్గిపోతోందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సునిశిత ప్రాంతం

సర్వోన్నత న్యాయస్థానం కొల్లేరును సునిశిత ప్రాంతంగా ప్రకటించింది. మంచినీటి సరస్సు  కొల్లేరుకు జల, ధ్వని, వాయు కాలుష్యంతో హాని కలిగించకూడదు. హాని కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు క్షేత్రస్థాయిలో గార్డుల దగ్గర నుంచి కన్జర్వేటర్‌ వరకు పటిష్ఠ యంత్రాంగం ఉన్నా అక్రమార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అనధికారిక సాగును అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో కొల్లేరు స్వరూపం పూర్తిగా మారిపోయే ప్రమాదముంది.

కొల్లేరు అభయారణ్యంలో వరి సాగు చేసే ప్రాంతానికి సిబ్బందిని పంపించి తనిఖీ చేయించి తగు చర్యలు చేపడతామని డీఎఫ్‌వో రవీంద్ర ధామ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు