‘నువ్విక్కడ బిల్డప్పులు ఇస్తావా?’.. రెచ్చిపోయిన మంత్రి రోజా ప్రధాన అనుచరుడు

నగరిలో మంత్రి రోజా ప్రధాన అనుచరుడు ప్రత్యూష్‌ రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడు. రేపు తెల్లార్తే నేనేంటో నీకు చూపిస్తానని బెదిరించాడు.

Updated : 14 Jan 2024 07:35 IST

నగరి, న్యూస్‌టుడే: నగరిలో మంత్రి రోజా ప్రధాన అనుచరుడు ప్రత్యూష్‌ రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడు. రేపు తెల్లార్తే నేనేంటో నీకు చూపిస్తానని బెదిరించాడు. చిత్తూరు నుంచి వచ్చేసి ఇక్కడ బిల్డప్పులు చూపిస్తావా? అని గద్దించాడు. స్టేషన్‌ దగ్గరకు రావాలని హెడ్‌ కానిస్టేబుల్‌ చెప్పగా రేపు తెల్లార్తే మేడమ్‌ (మంత్రి రోజా) దగ్గరకు నువ్వు రా? అంటూ హుకుం జారీ చేశాడు. కేవీపీఆర్‌పేటలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కుశస్థలి నదిలో ఇసుక అక్రమ రవాణా సమాచారంతో హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు. ట్రాక్టర్లలో కూలీలు ఇసుక నింపుతుండగా డ్రైవర్లను ప్రశ్నించారు. ఇసుక తరలింపునకు అనుమతి ఉందా? ఎక్కడకు తోలుతున్నారని అడగ్గా సీసీ రోడ్డు వేయడానికని, ప్రభుత్వ పనికే ఉపయోగిస్తున్నామని చెప్పారు.

ప్రత్యూష్‌ను అడిగి తెలుసుకోవాలని అతడితో చరవాణిలో మాట్లాడించారు. ఇసుక ప్రభుత్వ పనులకేనని, మా ట్రాక్టర్లే ఆపుతారా? అని ప్రత్యూష్‌ హెచ్చరించాడు. అక్కడే ఉండండి నే వస్తాననడంతో వారు ట్రాక్టర్లు వదిలేసి వెనుదిరగ్గా వారికి ఎదురొచ్చాడు. హెడ్‌కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి.. మా ట్రాక్టర్లు ఎలా ఆపుతారు? నేనెవరో తెలుసు కదా? కేసు పెట్టు అని విరుచుకుపడ్డాడు. ఇసుక ఎక్కడికి వెళ్తుందని మాత్రమే అడిగామని, అడ్డుకోలేదని హెడ్‌ కానిస్టేబుల్‌ చెప్పగా.. అతడిని దుర్భాషలాడుతూ, నీ డ్యూటీ నువ్వు చేసుకుపో, నీ పీసీ నంబరు చెప్పు? రేపు ఉంటావో లేదో చూస్తానని బెదిరించాడు. ‘మెయిన్‌ రోడ్డుపై 150 బండ్లు పోతున్నాయి. నిలబెట్టు. చిత్తూరు నుంచి వచ్చేస్తే మేం చెవులో పూలు పెట్టుకున్నామా? మేం లోకల్‌. పొయ్యి సీఐ దగ్గర మాట్లాడుపో’ అంటూ ప్రత్యూష్‌ చిందులు తొక్కాడు. నా పని నేను చేశానని, ఇసుక ట్రాక్టర్లు ఎక్కడకు వెళుతున్నాయని మాత్రమే అడిగానని హెడ్‌ కానిస్టేబుల్‌ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని