AP High Court: స్కిల్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Updated : 10 Nov 2023 13:44 IST

అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను హైకోర్టు ఈనెల 15కి వాయిదా వేసింది. విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కి వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కొందరికి నోటీసులు జారీ చేయడంలో ఆలస్యం జరిగిందని ఉండవల్లి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటీసులు జారీ చేసేందుకు జరిగిన ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం రిజిస్ట్రీకి సూచించింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించడంలో తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు తెలిపారు. అదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని