Cyclone Michaung: మిగ్‌జాం ఎఫెక్ట్‌.. కూలిన వృక్షాలు.. రహదారులు జలమయం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై ‘మిగ్‌జాం’ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి.

Updated : 05 Dec 2023 16:05 IST

ఏలూరు: మిగ్‌జాం తీవ్ర తుపాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉండి, భీమవరం, కాళ్ల తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చేతికందిన పంట కల్లాల్లోనే ఉండిపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల కోసిన వరి పంట పొలాల్లోనే మునిగిపోయింది. ముదినేపల్లి, కలిదిండి, పెదపాడు, నూజివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుమంట్ర తదితర చోట్ల వరి పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగాయి.

చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

‘మిగ్‌జాం’ ప్రభావంతో గుంటూరు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఎటు చూసినా పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కాకుమాను, కొండపాటూరు, కొమ్మూరు, అప్పాపురం, గార్లపాడు, రేటూరు, బీకే పాలెం, బొడిపాలెంలో పంటలు పూర్తిగా నీటమునిగాయి. కొండపాటూరులోని పోలేరమ్మ గర్భగుడిలోకి వర్షపు నీరు చేరింది. ఆలయ కమిటీ సభ్యులు ఇంజిన్లతో నీటిని బయటకు తోడుతున్నారు. కాకుమాను, అప్పాపురం చాప్టాలపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కూలిన భారీ వృక్షం

మరోవైపు ప్రకాశం జిల్లా కొండపి మండలం చిన్న వెంకన్నపాలెం వద్ద తుపాను ధాటికి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో కొండపి - టంగుటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని