Omicron: ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు

ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ మేరకు

Updated : 12 Dec 2021 14:12 IST

అమరావతి: ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు వెల్లడించింది. సదరు వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా విశాఖ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతడి నమూనాను సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్‌గా తేలినట్లు వెల్లడించింది.

బాధితుడికి ఎలాంటి లక్షణాలు లేవు..

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా మొత్తం 15 మందికి కరోనా నిర్ధారణ అయిందని.. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 15 మందిలో 10 మంది ఫలితాలు రాగా..  వారిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని వెల్లడించింది.  ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని..  బాధితుడికి శనివారం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కొవిడ్‌ నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ విషయంపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరింది. 

ఏపీలో నమోదైన తాజా కేసుతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 34కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 17 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు.

ఆ 40 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశాం: డీఎంహెచ్‌వో

జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు నమోదుకావడంపై విజయనగరం డీఎంహెచ్‌వో డా. రమణకుమారి స్పందించారు. ఈనెల 5న ఐర్లాండ్‌ నుంచి సదరు వ్యక్తి జిల్లాకు వచ్చారన్నారు. బాధితుడిని కలిసిన 40 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని.. వారికి నెగటివ్‌ వచ్చిందని తెలిపారు. బాధితుడి స్వగ్రామంలోనూ కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. అతడి ఇంటి పరిసరాల్లో సుమారు వంద మందికి టెస్టులు చేస్తున్నామని.. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఎంహెచ్‌వో అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని