Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Jul 2023 08:59 IST

1. గడువు పొడిగింపు ఉండదు.. రిటర్నులు త్వరగా వేయండి

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే గడువు (జులై 31)ను పొడిగించాలన్న ఆలోచన ఆర్థిక శాఖకు లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. అందువల్ల ఆఖరి రోజుల వరకు వేచి ఉండి, ఇబ్బందులు ఎదుర్కోకుండా.. సాధ్యమైనంత త్వరగా రిటర్నులు వేయాలని చెల్లింపుదార్లకు సూచించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికమొత్తంలో రిటర్నులు దాఖలవుతాయనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శ్రీవారి దర్శనానికి వచ్చే రెండు నెలల్లో రోజుకు 4 వేల అదనపు టికెట్లు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు రోజుకు నాలుగు వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అదనపు టికెట్లు త్వరలోనే జారీ చేస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ ఈవో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కుతకుతలాడుతున్న ప్రపంచం

భూగోళం వేడెక్కుతోందన్న శాస్త్రవేత్తల అంచనాలు నిజమవుతున్నాయి. గత నెలలో ప్రపంచం ఎన్నడూ లేనంతగా ఎండి వేడిమిని చవి చూసింది. యూరోపియన్‌ యూనియన్‌ వాతావరణ పర్యవేక్షణ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా, జపాన్‌, ఐరోపాలోని దేశాలు కుతకుతలాడాయి. ప్రజలను అవెన్‌లో పెట్టి ఉడికించినట్లుగా ఎండలు ఇబ్బంది పెట్టాయి. ఈ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేడు అక్కడక్కడా భారీ వర్షాలు

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయి. పశ్చిమ దిశ నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో 12 చోట్ల సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానుంది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వాటిని ఏర్పాటు చేస్తోంది. ఈ తరహా ఛార్జింగ్‌ కేంద్రాలు అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు రూ.95 లక్షలు విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో స్థానిక విద్యార్థులతోనే అన్‌-రిజర్వుడు సీట్ల భర్తీ

ఏపీలో 2014 ఫిబ్రవరి 2 తరువాత కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15% అన్‌-రిజర్వుడు (స్థానికేతర) సీట్లను ఆ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిరుటి వరకు తెలంగాణ విద్యార్థులూ ఈ కోటాలో సీట్లు పొందేందుకు అవకాశం ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు 20 నుంచి రిజిస్ట్రేషన్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శ్రీకారం చుట్టింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) షెడ్యూలును విడుదల చేసింది. జులై 20 నుంచి నమోదు(రిజిస్ట్రేషన్‌) ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటర్ల జాబితాలో మీపేరుందా?

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. సరైన నాయకుణ్ని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించుకోండి. అందుకు చాలా విధానాలున్నాయి. వీటి ద్వారా తరచి చూసుకుని, ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మన వాణిని ప్రపంచమంతా వింటోంది

గతంలో మన వాణిని ప్రపంచ దేశాలు అంత సీరియస్‌గా తీసుకునేవి కావని, కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రతిష్ఠ అంతర్జాతీయ వేదికలపై పెరిగిందని లఖ్‌నవూలో ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం ఆయన లఖ్‌నవూ వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారీ అప్పుల్లో ట్విటర్‌: ఎలాన్‌ మస్క్‌

ప్రకటనలు సగానికి పైగా తగ్గడంతో ట్విటర్‌ భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. నగదు ప్రవాహ స్థితి ఇప్పటికీ ప్రతికూలంగానే ఉందని, ప్రకటనల ఆదాయం దాదాపు 50 శాతం క్షీణించడంతో పాటు సంస్థ భారీ రుణభారంలో ఉందని తెలిపారు. కంపెనీ ఏదైనా చేయడానికంటే ముందుగా సరిపడా నగదు నిల్వలకు చేరుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని