Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Aug 2023 17:14 IST

1. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష.. ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు

అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు వచ్చే అవ‌కాశం ఉంద‌ని తితిదే ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భ‌క్తుల సౌక‌ర్యం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తిరుమ‌ల అన్నమయ్య భ‌వ‌న్‌లో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌, తితిదేలోని అన్ని విభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో స‌మీక్ష నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రపతి భవన్‌కు రాజకీయరంగు సరికాదు: పురందేశ్వరి

రాష్ట్రపతి భవన్‌ను ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి లాగారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దిల్లీలో రూ.100 ఎన్టీఆర్‌ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబసభ్యులు హాజరుకావడంపై రాజకీయ రంగు పులమడం శోచనీయమన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ ‘ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ’ సమావేశం వాయిదా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించాల్సిన తెలంగాణ కాంగ్రెస్‌ ‘ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ’ (పీఈసీ) సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 2న ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, అదే రోజు వైయస్‌ఆర్‌ వర్ధంతితోపాటు పలు కార్యక్రమాలు ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని మెజారిటీ సభ్యులు కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉద్యోగుల పిటిషన్‌పై విచారణ.. నిరసనకు మరో తేదీ చెప్పాలన్న హైకోర్టు

ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగులు నిరసన తెలిపేందుకు మరో తేదీని చెప్పాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మంత్రి విశ్వరూప్‌ కుమారుడిపై స్థానికుల తీవ్ర ఆగ్రహం

కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌కు నిరసన సెగ తగిలింది. అమలాపురం మండలం కామనగరువులో ఆయనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’లో భాగంగా కామనగరువుకు శ్రీకాంత్‌ వచ్చారు. దీంతో ‘‘మీ ఇంటి దహనంపై కేసుల పెట్టించి ఎందుకొచ్చారు?’’ అంటూ విశ్వరూప్‌ కుమారుణ్ని స్థానికులు నిలదీశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విదేశాలకు వెళ్లేందుకు జగన్‌, విజయసాయికి కోర్టు అనుమతి

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అనంతబాబు తరహాలో డోర్‌ డెలివరీ చేస్తామన్నారు’

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులు తనను కిడ్నాప్‌ చేసి గంటన్నరపాటు దాడికి పాల్పడ్డారని వైకాపా కార్యకర్త శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి సస్పెండైన నేత గంగవరం శేఖర్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నాననే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఆదేశాలతో అతడి అనుచరులు తనపై దాడి చేశారని ఆరోపించారు. కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ ప్రత్యేక భేటీ.. అజెండాపై సస్పెన్స్‌!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Special session of Parliament) ఐదు రోజులపాటు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. జీ20 సదస్సు (G20 Summit) ముగిసిన తర్వాత జరిగే ఈ సమావేశాల అజెండా ఏంటనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రైల్వే బోర్డు తొలి మహిళా సీఈవోగా జయావర్మ సిన్హా

రైల్వే బోర్డు (Railway Board) సీఈవో, ఛైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హా (Jaya Verma Sinha)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకానికి ‘కేబినెట్‌ నియామకాల కమిటీ (ACC)’ ఆమోద ముద్ర వేసింది. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయావర్మనే కావడం విశేషం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శరణార్థుల భవనంలో అగ్నిప్రమాద ఘటన.. ఆ గేటు వెనుక అన్నీ కాలిన శవాలే..!

దక్షిణాఫ్రికా (South Africa)లోని జోహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద (Fire Accident) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్రమాదం జరిగిన భవనంలో ఉన్నవారంతా శరణార్థులే (migrants)నని తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 73 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరో 52 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని