Jagan-Vijayasai Reddy: విదేశాలకు వెళ్లేందుకు జగన్‌, విజయసాయికి కోర్టు అనుమతి

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

Updated : 31 Aug 2023 19:58 IST


హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు యూకే పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కుమార్తెలను కలిసేందుకు భార్య భారతితో కలిసి యూకే వెళ్లనున్నట్టు జగన్‌ సీబీఐ కోర్టుకు తెలిపారు.

పొలిటికల్‌ క్లియరెన్స్‌ కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖను కూడా కోరినట్టు పేర్కొన్నారు. ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని సీబీఐ కోర్టును జగన్‌ అభ్యర్థించారు. సీఎం జగన్‌ యూకే పర్యటనకు అనుమతిఇవ్వొద్దని సీబీఐ వాదించింది. తీవ్రమైన ఆర్థిక నేరారోపణలున్న జగన్‌.. హక్కుగా కోర్టును అనుమతి అడగరాదని సీబీఐ  పేర్కొంది. ఎనిమిదేళ్లుగా ఏదో కారణంతో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలో ప్రస్తావించిందని  సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్‌ అక్రమాస్తుల కేసు సున్నితమైన, ఉన్నతస్థాయి ప్రొఫైల్‌ కేసుగా సీబీఐ పేర్కొంది. ఇరు వైపులా వాదనల అనంతరం జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

విజయసాయిరెడ్డికీ అనుమతి..

యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగించిన కోర్టు.. ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. సెప్టెంబరు 1 నుంచి జనవరి 31 మధ్య 30 రోజులు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. రూ.2లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఫోన్‌ నంబరు,ఈమెయిల్‌, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు సమర్పించి పాస్‌ పోర్టు తీసుకొని.. దేశానికి తిరిగి రాగానే మళ్లీ కోర్టులో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, జనవరి 31 లోగా అభియోగాలు నమోదు చేస్తే తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని విజయసాయికి కోర్టు షరతు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు