Krishna: మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు.

Updated : 02 May 2024 18:37 IST

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. జనసేన నేత కర్రి మహేశ్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో పేర్ని క్రిష్ణమూర్తి(కిట్టు) ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు మహేశ్‌ ఇంటి ఎదుట బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేమిటని ప్రశ్నించిన మహేశ్‌ కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేయడంతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. 

ఘటనపై సమాచారం తెలుసుకున్న జనసేన, తెదేపా నాయకులు బాధితులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెదేపా, జనసేన, మహేశ్‌ కుటుంబ సభ్యులు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు మచిలీపట్నం తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు.

ఈసీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: ఎంపీ బాలశౌరి

మహేశ్‌ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన పేర్ని కిట్టు అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూటమి మచిలీపట్నం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు  బాలశౌరి, కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఎస్పీ కార్యాలయం లోపల వందలాదిమంది కార్యకర్తలతో న్యాయం కోసం బైఠాయించారు. రేపటిలోగా పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు, అనుచర వర్గాన్ని అరెస్టు చేయాలని బాలశౌరి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వేలాది మంది కార్యకర్తలతో పేర్ని నాని ఇంటిని ముట్టడిస్తామన్నారు. మహేశ్‌ కుటుంబంపై జరిగిన దాడిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో పాటు రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని