America: అమెరికాలో కాల్పుల కలకలం.. నిందితుడితోసహా అయిదుగురి మృతి

అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఒకే వ్యక్తి.. కొలరాడోలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన బహిరంగ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని హతమార్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గాయపడినవారిలో...

Published : 28 Dec 2021 20:43 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఒకే వ్యక్తి.. కొలరాడోలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన బహిరంగ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని హతమార్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గాయపడినవారిలో ఒక పోలీసు ఉన్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇక్కడి డెన్వర్, లేక్‌వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు. ‘తొలుత డెన్వర్‌లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. అనంతరం లేక్‌వుడ్‌కు వెళ్లి.. అక్కడ మరొకరిని కాల్చి చంపాడు. ఒక వ్యక్తిని గాయపరిచాడు’ అని వివరించారు.

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన లేక్‌వుడ్‌ పోలీసులు.. అంతకుముందు జరిగిన ఘటనల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పట్టుకునేందుకు యత్నించగా.. కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు లేక్‌వుడ్ పోలీసు ప్రతినిధి జాన్ రొమెరో చెప్పారు. ఈ క్రమంలో ఓ అధికారికి గాయాలు కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. నిందితుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడో తెలియదని, దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని