
ఆ రైళ్లలో 97 మంది మరణించారు
వలస కార్మికుల మృతిపై రాజ్యసభలో కేంద్రం వెల్లడి
దిల్లీ: లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించడానికి కేటాయించిన ప్రత్యేక శ్రామిక రైళ్లలో 97 మంది మరణించారని శనివారం కేంద్రం వెల్లడించింది. సెప్టెంబరు 9 వరకు సేకరించిన గణాంకాలను శనివారం రాజ్యసభకు తెలిపింది. సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు.
‘శ్రామిక రైళ్లలో మొత్తం 97 మరణాలు సంభవించగా..87 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇప్పటివరకు సంబంధిత రాష్ట్రాల పోలీసులు 51 పోస్టుమార్టం నివేదికలను అందజేశారు. వాటిని పరిశీలించగా..గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మెదడులో రక్తస్రావం, దీర్ఘకాలికంగా ఊపిరిత్తుల్లో సమస్య, కాలేయ సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధులు వారి మరణాలకు కారణాలు’ అని మంత్రి వెల్లడించారు. కాగా, కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన 68 రోజుల లాక్‌డౌన్ కాలంలో ఎంతమంది వలస కార్మికులు మరణించారనే దానిపై సమాచారం అందుబాటులో లేదని లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే.
నగరంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చడానికి కేంద్రం మే ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 4,621 శ్రామిక రైళ్లను నడిపింది. వాటి ద్వారా 63,19,000 మంది స్వగ్రామాలకు చేరుకున్నారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. కాకపోతే రైళ్లలో ప్రయాణించే క్రమంలో వారికి సరైన ఆహారం, నీళ్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో లేక మరణాలు సంభవించినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.