Facebook Love: మొన్న సీమా.. నిన్న అంజు.. ఇవాళ జూలీ.. సరిహద్దులు దాటుతున్న ‘ప్రేమ’

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడేందుకు ఓ మహిళ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చేసింది. అయితే, కుటుంబ కలహాలతో అసలు విషయం బయటపడింది.

Published : 27 Jul 2023 17:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియా ప్రేమలు.. సరిహద్దులు దాటి పెళ్లిళ్లు.. ఈ తరహా ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ అనే వివాహిత పబ్జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భారత్‌ వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్కడికి రెండు రోజుల వ్యవధిలోనే భారత్‌కు చెందిన అంజూ అనే వివాహిత తన ప్రియుడు నస్రుల్లాను కలుసుకునేందుకు పాకిస్థాన్‌ వెళ్లి ఫాతిమాగా పేరు మార్చుకొని అతడినే వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు ఫేస్‌బుక్కే వేదిక. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజయ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు జూలీ అనే మహిళ బంగ్లాదేశ్‌ నుంచి వచ్చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం కూడా జరిగిపోయింది. అయితే, కుటుంబ కలహాలతో అసలు విషయం బయటపడింది. బంగ్లాదేశ్‌లో ఉన్న తన కుమారుడిని విడిపించాల్సిందిగా అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజా విషయం వెలుగులోకి వచ్చింది.

ఏంటీ ప్రేమ కథ?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అజయ్‌కి బంగ్లాదేశ్‌కు చెందిన జూలీతో 2017లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2022లో జూలీ భర్త చనిపోయాడు. దీంతో జూలీని వివాహం చేసుకోవాలని అజయ్‌ నిర్ణయించుకున్నాడు. అతడి సూచనమేరకు బంగ్లాదేశ్‌ నుంచి ఆమె భారత్‌కు వచ్చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే, వృత్తి రీత్యా అతడు కర్ణాటకలో ఉండాల్సి రావడంతో.. భార్యను ఇంటి వద్దనే ఉంచాడు. కొన్నాళ్లకు  అత్తాకోడళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. అవి తీవ్రం కావడంతో కోపంతో జూలీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొడుకు వచ్చి ప్రశ్నించగా అతడిని కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని తల్లి వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో అజయ్‌ కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

పాక్‌ ప్రియుణ్ని పెళ్లాడిన భారత మహిళ

తాజాగా బంగ్లాదేశ్‌లో తన కొడుకు నరకయాతన అనుభవిస్తున్నాడంటూ రక్తమోడుతున్న ఫొటోతో వెళ్లి అతడి తల్లి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని భారత్‌కు రప్పించారు. అయితే, తాను బంగ్లాదేశ్‌ వెళ్లలేదని, పశ్చిమబెంగాల్‌ సరిహద్దులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నానని చెప్పాడు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలుజారి పడిపోయానని, దీంతో తలకు బలంగా గాయమైందని పోలీసులకు తెలిపాడు. నిశితంగా ప్రశ్నించగా తాను బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు అంగీకరించాడు. అయితే, అక్కడ ఏం జరిగింది? గాయాలకు కారణాలేంటి? అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు. మీడియాతో  తాను పశ్చిమబెంగాల్‌ సరిహద్దులోనే ఉన్నట్లు అజయ్‌ చెప్పుకొచ్చాడు. పోలీసులు అతడిపై  ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు యూపీ పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని