BJP: కర్ణాటక ‘సార్వభౌమత్వం’ పిలుపుపై దుమారం.. కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు!

కర్ణాటక సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేలా తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ పేరిట కాంగ్రెస్‌ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది.

Published : 08 May 2023 18:33 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం చివరి రోజు కీలక పరిణామం. కర్ణాటక (Karnataka) ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి (Sovereignty), సమగ్రతకు ముప్పు వాటిల్లేలా తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ (Sonia Gandhi) పేరిట కాంగ్రెస్‌ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మైసూరులో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలను ఖండించారు. వేర్పాటువాదంపై ఆ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. భాజపా సైతం ఈ ట్వీట్‌పై మండిపడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress)తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాసింది.

‘కాంగ్రెస్‌ ట్వీట్‌ దురదృష్టకరం. స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన కన్నడవాసులను అవమానించడమే ఇది. జాతీయవాదులు, ప్రగతిశీలవాదులైన కర్ణాటక పౌరులను రెచ్చగొట్టేలా ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సమభావం, శాంతిసామరస్యాలకు విఘాతం కలిగించడమే దీని వెనకున్న ఉద్దేశం. దేశాన్ని దెబ్బతీయాలనే లక్ష్యం ఉన్న కొన్ని వర్గాల మద్దతు, ఓట్లు పొందేందుకే ఈ ట్వీట్‌ చేశారు’ అని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో భాజపా పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ.. దేశ వ్యతిరేక శక్తుల పట్ల పక్షపాతం వహించే పార్టీ అని, పీఎఫ్‌ఎఐ వంటి వేర్పాటువాద సంస్థలు, ఉద్యమాలకు ఇది మద్దతిస్తోందని ఆరోపించింది.

‘భారత్‌లో కర్ణాటక ముఖ్యమైన రాష్ట్రం. ఒక రాష్ట్ర సార్వభౌమాధికార పరిరక్షణకు కోసం పిలుపునివ్వడం.. వేర్పాటువాద పిలుపుతో సమానం. ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది’ అని భాజపా పేర్కొంది. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలను కాంగ్రెస్‌ పార్టీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, ఎన్నికల నియమావళికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, శిక్షార్హమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అభ్యర్థించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తదితర భాజపా నేతలతో కలిసి ఈ లేఖను ఈసీ అధికారులకు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని