Water Scarcity: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్‌, పర్యవేక్షణకు సెక్యూరిటీ.. హౌసింగ్‌ సొసైటీ నిర్ణయం!

నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని హౌసింగ్‌ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. 

Published : 05 Mar 2024 15:23 IST

బెంగళూరు: వేసవి పూర్తిస్థాయిలో రాకముందే.. బెంగళూరు (Bengaluru) ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి (Water Scarcity)ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని యల్హంక, కనకపుర, వైట్‌ఫీల్ట్‌ ప్రాంతాల్లో నివసించే వారిని ఈ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ఈక్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్‌ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపింది. 

‘‘గత నాలుగు రోజులుగా బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్‌ బోర్డు నుంచి నీరు రావడం లేదు. ప్రస్తుతం బోర్ల ద్వారా నీరు అందిస్తున్నాం. హౌసింగ్‌ సొసైటీలో నివసించేవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని కోరుతున్నాం. దీనివల్ల వేసవిలో ఎక్కువ రోజులు నీరు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే.. వారికి రూ. 5వేలు జరిమానా విధిస్తాం. ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తారు’’ అని వైట్‌ఫీల్డ్‌లోని పామ్‌ మిడోస్‌ హౌసింగ్ సొసైటీ గృహసముదాయాల్లోని వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. 

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ఇందులోభాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు మార్చి 7 నాటికి తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరుచేసినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. బెంగళూరు నగరంలోని ప్రజల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరా కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని